వైసీపీ నేత ముందు కొత్త డిమాండ్.. క్లారిటీ కావాలంటున్న జగన్..!

Thursday, October 10th, 2019, 04:17:41 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా రాజకీయపరమైన అంశాలలో కూడా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాడు. ఈ ఎన్నికలలో అన్ని జిల్లాలలో మెజారిటీ స్థానాలను దక్కించుకున్న జగన్, వచ్చే ఎన్నికల కొరకు ఈ సారి ఓడిపోయిన స్థానాలపై మరింత దృష్టి సారించాడు.

అయితే ఈ ఎన్నికలలో ఓడిపోయి సైలెంట్‌గా ఉన్న నేతలలో కొందరికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. అయితే పరుచూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సీనియర్ రాజకీయ నేత, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై జగన్ ఒక కొత్త డిమాండ్ ఉంచారని పార్టీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి ఓటమిపాలైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాస్త పార్టీలో యాక్టివ్‌గా లేకపోవడంతో వైసీపీ మాజీ నేత రాంబాబును తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు జగన్. అంతేకాదు త్వరలోనే ఆయనకు నియోజకవర్గ బాధ్యతలను అప్పచెప్పాలని కూడా అనుకుంటున్నారు. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురంధేశ్వరి బీజేపీలో ఉండడం ఆమె పార్టీలో కీలక పదవి కోసం పోటీ పడుతుండడంతో ఇక దగ్గుబాటిని సైడ్ చేస్తేనే రాజకీయంగా మంచిదని జగన్ అనుకుంటున్నారని, ఒక వేళ అలా కాకపోతే పురంధేశ్వరిని వైసీపీలోకి వచ్చేలా చేయాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముందు జగన్ ఈ కొత్త డిమాండ్‌ని వినిపించారని సమాచారం. అయితే ఇవన్ని ఆలోచించుకుని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీలో కొనసాగుతారా లేక వెళ్ళిపోతారా అనేది కూడా క్లారిటీ కావాలని జగన్ అడిగారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయట.