హ్యాట్సాఫ్ అంటూనే కేసీఆర్‌ని ఇరకాటంలో పెట్టిన జగన్..!

Friday, December 13th, 2019, 08:29:18 PM IST

మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఏపీ సర్కార్ దిశ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టింది. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే 21 రోజుల్లోనే తీర్పు వెలువడుతుందని వెంటనే నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. అయితే ఈ చట్టానికి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.

అయితే ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ నేరం చేసిన వారు ఎంతటివారైనా సరే వదలకూడదని, చట్టాల్లో విప్లవాత్మక చర్యలు తీసుకుంటేనే మార్పు వస్తుందని అన్నారు. అయితే దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయించిన సీఎం కేసీఅర్‌కు మరోసారి హ్యాట్సాఫ్ చెప్పారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా నిందితులను సీఎం కేసీఆరే ఎన్‌కౌంటర్ చేయించారని జగన్ అంటుటే ఈ ఎన్‌కౌంటర్‌లో నిజంగా సీఎం హస్తం ఉందా అన్న ప్రశ్నలు మళ్ళీ తెర మీదకు వచ్చాయి. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమీషన్ ఇప్పటికే విచారణ జరుపుతున్న సమయంలో సీఎం జగన్ కేసీఆరే ఎన్‌కౌంటర్ చేయించారనడంతో కేసీఆర్‌ను ఇరకాటంలోకి నెట్టినట్టుగా కనిపిస్తుంది.