వైసీపీ ఎంపీకి క్లాస్ పీకిన జగన్.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ..!

Friday, November 22nd, 2019, 08:51:36 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఏపీ రాజాకీయాలలో మాత్రం ఇంకా వేడి తగ్గలేదనే చెప్పాలి. దీనికి తోడు ప్రస్తుతం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీలో మరింత కాకరేపుతోంది. ఇటీవల పార్లమెంట్‌లో ఇంగ్లీష్ మీడియం వివాదంపై స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తెలుగు భాష కోసం నిధులు తెచ్చుకుని, ఇంగ్లీష్ మీడియం కోసం వినియోగిస్తారా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

అయితే దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుండడంతో జగన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారట. అయితే దీని గురుంచి ఆయన ఇదివరకే వివరణ ఇచ్చుకున్నా నిన్న ప్రధాని మోదీనీ కలిసి ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆశీర్వాదం తీసుకోవడం, బీజేపీ ఎంపీ సుజానా చౌదరి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యలు చేయడంతో జగన్ ఎంపీ రఘురామకృష్ణంరాజును తనతో కలవాలని ఆదేశించారట. ఈ నేపథ్యంలో నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభలో వైసీపీ పక్ష నేత మిథున్ రెడ్డితో కలసి రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌ను కలిశారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడడం, విజయసాయిరెడ్డికి తెలియకుండా ప్రధాని మోదీ, ఇతర నేతలను కలవడంపై జగన్ క్లాస్ పీకారట. అయితే రఘురామకృష్ణంరాజు మాత్రం పార్లమెంట్‌లో ప్రసంగం విషయంలో తాను పార్టీ ఆదేశాలకు కట్టుబడే మాట్లాడనని, పార్లమెంట్‌లో తాను భయటకు వెళ్తున్న సమయంలో ప్రధాని మోదీ అటు వైపు వెళ్తున్నరని, తాను నమస్కారం చేయగా మోదీ నా భుజం తట్టి వెళ్ళిపోయారని, మోదీ తనకు ఎప్పటినుంచో తెలుసని, ఇకపోతే పార్టీ మార్పు ఆలోచనలు తనకే కాదు వైసీపీ నేతలకు ఎవరికి లేవని క్లారిటీ ఇచ్చారు.