బెజవాడ ప్రజలకు జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటో తెలుసా..!

Sunday, June 16th, 2019, 11:23:00 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలన్ని ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యారు. అయితే తాజాగా బెజవాడ ప్రజల చిరకాల స్వప్నాన్ని కూడా నెరవేర్చి వారికి అది న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాడు.

అయితే ఎప్పటి నుంచో బెజవాడ ప్రజల చిరకాల కోరికగా దుర్గగుడి ఫ్లై ఓవర్ మిగిలిపోయింది. ఒక పక్క నది, అమ్మవారి ఆలయం, కొండలు ఉండడంతో జాతీయ రహదారిని బైపాస్‌గా ఊరి చివర నిర్మించాలని అనుకుంటున్నా అది సాధ్యపడేలా కనిపించడలేదు. రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలతో నగర వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే ఆలోచనలో గత టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో పొత్తులో ఉండడంతో ఒక ఫ్లైఓవర్ నిర్మించాలని అనుకుని పనులను కూడా ప్రారంభించారు. అయితే కొద్ది రోజులకే చంద్రబాబు కేంద్రంతో విడిపోవడం వలన ఫ్లైఓవర్ పనులు పూర్తిగా ఆగిపోయాయి.

ఆ తరువాత ఎన్నికలు రావడంతో అసలు దీని గురించి టీడీపీ ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. అయితే ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడం, వైసీపీ బీజేపీతో మంచి సాన్నిహిత్యంగా ఉండడంతో బెజవాడ ప్రజలకు మళ్ళీ దీనిపై ఆశలు చిగురించాయి. అయితే విజయవాడ ప్రజల చిరకాల స్వప్నం అయిన దుర్గగుడి ఫ్లైఓవర్ పనులను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబరు 31 నాటికి పూర్తి చేసి తీరుతామని, కొత్త ఏడాది గిఫ్టుగా ఆ బ్రిడ్జిని ఓపెన్ చేస్తామని సీఎం జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే నేడు ఏపీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించి జగన్ ఆదేశాల మేరకు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.