కాంగ్రెస్‌ని వీడి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేకు కేసీఆర్ బంఫర్ ఆఫర్..!

Saturday, February 8th, 2020, 07:06:58 PM IST

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. 2018 ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ తరుపున ఎల్బీనగర్ నుంచి పోటీ చేసిన సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్‌పై 17,848 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే అనంతరం నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్న సుధీర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే ఈయనతో పాటు కాంగ్రెస్‌ను వీడి టీఅర్ఎస్‌లో చేరిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డికి మహిళా కోటాలో కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించారు.

అయితే తాజాగా సుధీర్ రెడ్డికి కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మూడేళ్లు కొనసాగనున్నారు. అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన హుడా చైర్మెన్‌గా పనిచేశారు. దేశంలోనే అతి పెద్దదైన పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డు ప్లానింగ్, అమలు, పూర్తి చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం మూసీనదిని ప్రక్షాళణ చేయాలని ప్రభుత్వం భావిస్తుండడంతో ఈ పదవికి సుధీర్ రెడ్డి అయితేనే బాగుంటుందని భావించిన సీఎం కేసీఆర్ ఆయనకు ఈ పదవిని కట్టబెట్టారు.