ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్న సీఎం కేసీఆర్ – మీరెక్కడ పోయారు…?

Wednesday, March 25th, 2020, 01:00:41 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రజా ప్రతినిధులందరిపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా భయంకరమైన కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తున్న తరుణంలో, ఆ మహమ్మారి అరికట్టడానికి రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రజానియంత్రణ చర్యల్లో భాగంగా పోలీసులు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారని, కానీ ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మాత్రం ఒక్కరు కూడా కనిపించడంలేదని సీఎం కేసీఆర్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా 150 మంది కార్పొరేటర్లు కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడుతున్నారు.

అంతేకాకుండా ఈ భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ ని అరికట్టడానికి అందరు కూడా చర్యల్లో పాల్గొంటున్నారని, కానీ ఒక ప్రజాప్రతినిధులుగా మీకు బాధ్యత లేదా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అయితే ఈ ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ చర్యల్లో పాల్గొని, తగిన సపర్యలు చేయాలనీ ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ ప్రాంతంలోని మూడు పోలీస్ కమిషనరేట్లు పరిధిలో ఉన్నటువంటి సిటీ, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని ప్రజాప్రతినిధులు అందరు కూడా ప్రజా నియంత్రణ చర్యల్లో పాల్గొనాలని, సిగ్నళ్లు, కూడళ్ల వద్ద నిలుచుని ప్రజలు ఈ నిబంధనలను ఉల్లంఘించకుండా చూడాలని సీఎం కేసీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు.