ఇక విదేశాల నుండి మనకు కరోనా రాదు – సీఎం కేసీఆర్ కీలక వాఖ్యలు

Monday, March 30th, 2020, 07:24:38 AM IST

ఒకవైపు భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా దారుణంగా వ్యాపిస్తున్న తరుణంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కీలకమైన చర్యలను తీసుకుంటున్నాయి. అయితే మన ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వలన ఈ కరోనా వైరస్ ని నివారించవచ్చని ప్రణాళికలు వేస్తున్నారు. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం… తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 70 కి చేరిందని, వారిలో మొదటగా కరోనా వైరస్ సోకిన 11 మందికి కరోనా నెగటివ్ రావడం ఒక గొప్ప శుభవార్త అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వారితో పాటే మరికొందరికీ కూడా ఈ కరోనా వైరస్ నెగటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వారి ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఇకపోతే రాష్ట్రంలో దాదాపుగా 25,937 మందిపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశామని, అయితే వారిలో మిగిలిన దశల్లో పరీక్షలు జరిపిస్తున్నామని, ఒకవేళ వారిలో కూడా ఈ భయంకరమైన కరోనా వైరస్ లక్షణాలు కనిపించని పక్షంలో వారిని కూడా మార్చి 30 నాటికి 1899 మందిని, మార్చి 31 నాటికి 1450 మందిని వారి ఇళ్లలోకి పంపించేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ వలన అంతర్జాతీయ విమానాశ్రయాలు, పోర్టులు మూతపడడంతో బయటి దేశాల నుంచి కరోనా బాధితులు తగ్గిపోయారని, ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్న వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అందుకనే ఈ కఠినమైన లాక్ డౌన్ అస్త్రాన్ని ప్రయోగించి, మంచి ఫలితాలని రాబట్టామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు.