ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ మరో టార్గెట్.. వెనక్కితగ్గేలా లేడుగా..!

Monday, October 21st, 2019, 11:48:11 PM IST

ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తారాస్థాయికి చేరుకుంది. అయితే అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ఆర్టీసీలో ప్రభుత్వాన్ని విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక మీదట ఆర్టీసీ కార్మికులతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధులకు హాజరుకానీ సిబ్బందిని ఇక తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగులు మాత్రమే అని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే సమ్మెపై వెనక్కి తగ్గని కార్మికులు సమ్మెను మరింత ఉదృత్తం చేశారు. అయితే సమ్మె చేస్తూ దాదాపు 15 రోజులు గడిచినా కార్మికుల విషయంలో మాత్రం సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. పండగ సీజన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించేలా సమ్మె ఉందని, విరమించుకోవాలని చెప్పినా కార్మికులు వినలేదని సంస్థ మరింత నష్టాలలోకి వెళ్ళిందని ఇప్పుడు వారందరికి గత నెల జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని ప్రభుత్వం తరుపున నేడు కోర్ట్‌లో వాదనలు వినిపించాయి. అయితే హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నేపధ్యంలో ఈ విషయంలో కాస్త సైలెంట్‌గా ఉన్న సీఎం కేసీఆర్ నేడు ఉప ఎన్నిక పూర్తవ్వడంతో ఆయ్న నెక్స్ట్ టార్గెట్ ఇక ఆర్టీసీ సమ్మెనే అని, ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతోనే పూర్తిస్థాయిలో బస్సులు నడిపేలా, మరిన్ని ప్రైవేటు బస్సులను కూడా తీసుకునే అవకశాలు ఉన్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఉన్న దూకుడుకు హుజూర్‌నగర్ టీఆర్ఎస్ ఖాతాలో కనుక పడితే ఇక ఆయన సమ్మెపై వెనక్కి తిరిగి చూడడని, హుజూర్‌నగర్ ఫలితమే ఆర్టీసీ సమ్మెపై తాడో పేడో తేలుస్తుందని అంటున్నారు.