కోవిడ్ చికిత్సకు ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరండి – సీఎం కేసీఆర్

Tuesday, May 18th, 2021, 03:00:50 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనాపై పరిస్థితులు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్య శాఖ అధికారులతో నేడు సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క‌రోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాక్ డౌన్, జ్వర సర్వే, కోవిడ్ కిట్ల పంపిణీ వంటి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కారనంగా కరోనా అడ్మిషన్లు తగ్గడం, డిశ్చార్జిలు పెరగడం సంతోషకరమని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన్ వ్యాక్సినేషన్‌పై ఎప్పటికప్పుడు కేంద్రాన్ని సంప్రదిస్తూ తెప్పించుకోవాలని అన్నారు.

ఇకపోతే కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని, అదనంగా మరో 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని అన్నారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 6,926 బెడ్లు ఖాళీగా ఉన్నాయని, అందులో ఆక్సిజన్ బెడ్స్ 2,253, ఐసీయూ 533, జనరల్ బెడ్స్ 4,140 ఖాళీగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, రెమిడెసివిర్ మందులు సహా అన్నీ అందుబాటులో ఉన్నాయని ప్రజలు అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి డబ్బులు పోగొట్టుకోవద్దని సీఎం కేసీఆర్ అన్నారు.

ఇదిలా ఉంటే కరోనా నుంచి కోలుకున్న కొందరు బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి బారిన పడుతున్నారని దానికి సంబంధించి చికిత్స కోసం ఈ.ఎన్.టి, గాంధీ ఆస్పత్రుల్లో, జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లో చికిత్స, అవసరమైన మందులు సమకూర్చాలని కూడా సీఎం కేసీఆర్ అధికారులను కోరారు. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రంలో కొత్తగా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ లలో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

అయితే ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు మరియు మందులు అందించేందుకు కొత్తగా 12 రీజినల్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. మౌలిక వసతుల రీజినల్ సబ్ సెంటర్ల పరిధిలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు యుద్ధప్రాతిపదికన మందులు అందించడానికి అద్దె లేదా సొంత ప్రాతిపదికన వాహనాలను తక్షణమే ఏర్పాటు చేయాలని అలాగే మందులు నిల్వ చేయడానికి సబ్ సెంటర్లలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.