కేంద్రం వద్దు.. రాష్ట్రం ముద్దు అంటున్న కేసీఆర్..!

Wednesday, June 5th, 2019, 03:49:50 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి రెండో సారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం వచ్చిన లోక్‌సభ ఎన్నికలలో కూడా విజయం తమదేనని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను, 16 స్థానాలను గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పుతామనే వాదనలు కూడా వినిపించారు కేసీఆర్. దేశవ్యాప్తంగా ప్రజలలో జాతీయ పార్టీలపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ప్రాంతీయ పార్టీలన్ని ఏకం చేసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో అధికారంలో ఉండొచ్చని భావించారు కేసీఆర్. అంతేకాదు పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసి వారిని కూడా ఫ్రంట్‌లో భాగం కావలసిందిగా కోరారు.

అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్‌కు తాను అనుకున్నదొకటి జరి ంగింది మరొకటి అన్నట్టు కనిపించింది. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదని, హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని అదే జరిగితే బీజేపీకి మన మద్ధతు అవసరం ఉంటుందని భావించారు కేసీఆర్. ఒకవేల వారు మద్ధతు కోరితే తమ పార్టీకీ ఒక రెండు, మూడు కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయనే ఆశలు పెట్టుకున్నారు. అయితే కేసీఅర్ అంచనాలన్ని తలకిందులై కేంద్రంలో రెండో సారి భారీ మెజారిటీతో ఎవరి అవసరం లేకుండానే సొంతంగా అధికారాన్ని చేపట్టగలిగింది బీజేపీ. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ 17 స్థానాలకు కాను టీఆర్ఎస్ కేవలం 9 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే బీజేపీ 4 స్థానాలను, కాంగ్రెస్ 3 స్థానాలను గెలుచుకోగా, ఎంఐఎం ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా విఫలమై కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న బీజేపీ అనూహ్యంగా పుంజుకుని ఏకంగా 4 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా సీఎం కేసీఆర్ కూతురు కవితను కూడా ఓటమిపాలు చేసింది. అయితే నిన్న వెలువడిన స్థానిక సంస్థల ఫలితాలలో స్పష్టమైన ఆధిక్యత రావడంతో కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చేసుకున్నాడట. కేంద్రంలో బీజేపీకి ఇక ఎలాగో తమ అవసరం లేదని రాష్ట్రంలోనైన పార్టీనీ మరింత పటిష్టం చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే పార్టీ కార్యకలాపాలపై ఇప్పుడు పూర్తి దృష్టి సారించడమే కాకుండా ఇన్ని రోజులు పక్కకి పెట్టిన హరీశ్‌రావు, కేటీఆర్‌లను తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తు మరింత మెరుగైన పాలనను ప్రజలకు అందించేలా పావులు కదుపుతున్నారట.