ఆంజనేయుడి జన్మస్థలంపై వివాదం చేయడం సరికాదు – బ్రహ్మానందం

Friday, June 4th, 2021, 08:58:57 PM IST

రామబంటు, అంజనీపుత్రుడు ఆంజనేయ స్వామి జన్మస్థలంపై గత కొద్ది రోజులుగా వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. టీటీడీ, కిష్కింధ సంస్థాన్ ట్రస్టులు అంజనేయుడు జన్మ స్థలంపై ఒకరికొకరు తమ వాదనలు వినిపించుకుంటూనే విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఓ టీవీ ఛానల్ ప్రత్యేక కార్యక్రమం లైవ్‌లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే భక్తికి నిదర్శనం ఆంజనేయ స్వామి అని, ఆంజనేయుడు ఎక్కడ పుట్టారని వివాదం చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. ఆంజనేయుడు ఎక్కడ పుట్టారన్న దానిపై వాదనలు, విమర్శలు చేసుకోవడం కంటే ఆంజనేయుడు భారత దేశంలో పుట్టారని గర్వపడితే మంచిదని వ్యాఖ్యానించారు. ఆంజనేయుడు అందరివాడని దయచేసి ఈ అంశంపై టీటీడీ, కిష్కింధ సంస్థాన్ ట్రస్టులు విమర్శలు చేసుకుంటూ వివాదస్పదం చేయవద్దని బ్రహ్మానందం విజ్ఞప్తి చేశారు.