త్రివిక్ర‌మ్‌, దిల్‌రాజుల పై క‌మెడియ‌న్‌ బాంబ్‌!?

Tuesday, June 26th, 2018, 03:40:10 PM IST

అవకాశాల కోసం ప్ర‌య‌త్నించ‌డం అంటే అంత సులువేం కాదు. ఒక్కోసారి కొంద‌రికి ఛాన్స్ వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి ఛేజారిపోతుంది. కొంద‌రు చూద్దాం.. చేద్దాం అంటూ నాన్చేస్తారు. అలా చేయ‌డంతో జీవితాలు వెయిటింగులోనే కాలిపోతుంటాయి. కొంద‌రు ఆర్టిస్టులు, ద‌ర్శ‌కుల ప‌రిస్థితి టాలీవుడ్‌లో అలానే ఉంది. హిట్టిచ్చిన‌వాళ్ల‌కే తికాణా ఉండ‌దు ఈ మాయా ప్ర‌పంచంలో. అలాంటిది క‌మెడియ‌న్లు, ఇత‌ర‌త్రా న‌టీన‌టుల స‌న్నివేశం ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఇండ‌స్ట్రీ దిగ్గ‌జం, ది గ్రేట్ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ శ్యాంప్ర‌సాద్ రెడ్డి ఎంద‌రో న‌టీన‌టుల‌కు జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా గొప్ప అవ‌కాశం ఇచ్చారు. ఇందులో త‌మ‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని క‌మెడియ‌న్లు అంతా సినిమాల్లో బిజీ అయిపోయారు. ఆ కోవ‌లోనే ష‌క‌ల‌క శంక‌ర్ జ‌బ‌ర్థ‌స్త్ వ‌ల్ల పొట్ట పోషించుకుని, అటుపై ఏకంగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయాడు. అంతేకాదు ఇక్క‌డే అత‌డు పెద్ద హీరోగానూ ఎదిగేసేందుకు స్కెచ్ వేశాడు. ప్ర‌య‌త్నిస్తే పోయేదం ఉంది? మ‌హా అయితే పూచిక పుల్ల అనుకున్నాడు.

శంక‌ర్ ఇన్నాళ్లు క‌మెడియ‌న్‌గా న‌టించి న‌టించి విసిగిపోయాడు. ఆ క్ర‌మంలోనే హీరోగానూ ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడు. కామెడీ హీరోల‌కు దుర్ధినాలు న‌డుస్తున్న ఈ రోజుల్లో శంక‌ర్ దానిని మార్చాల‌ని క‌ల‌లు గంటున్నాడు. ఈ గ్యాప్‌ని ఫిల్ చేసి దూసుకుపోవాల‌ని అనుకుంటున్నాడు. ఆ క్ర‌మంలోనే అత‌డు న‌టించిన `శంభో శంక‌ర‌` ఈనెల 29న రిలీజ్‌కి దూసుకొస్తోంది. ఈ సినిమాతో ఎట్టి ప‌రిస్థితిలో హిట్ కొట్టాల‌న్న క‌సిలో ఉన్నాడు. అంతేకాదు త‌న‌ను మూడేళ్లుగా చుట్టూ తిప్పుకుంటున్న ఇండ‌స్ట్రీపై క‌సి తీర్చుకోవాల‌నుకుంటున్నాడు. క‌మెడియన్‌వి నువ్వు హీరో ఏంటి? అంటూ త‌న‌ని ఎగ‌తాలిగా చూసిన‌వాళ్లంద‌రినీ శంక‌ర్ ఏస్కోవాల‌నుకుంటున్నాడు. గేలి చేసిన వాళ్ల‌ను, అవ‌హేళ‌న‌గా మాట్లాడిన వాళ్ల‌ను డైరెక్టుగానే నిన్న ఓ ప్రెస్‌మీట్లో ఎటాక్ చేశాడు శంక‌ర్‌. ఇందులో స్టార్ రైట‌ర్ కం డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌, స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు, అల్లు అర‌వింద్ చిన్న కొడుకు శిరీష్ ఉన్నారు. అయితే వీళ్లంతా త‌న‌కు ఎంతో స‌న్నిహితులు అని .. క‌లిసి సినిమాలు చేశాన‌ని చెప్పిన శంక‌ర్‌.. కాస్త వేచి చూస్తే అవ‌కాశ‌మిస్తామ‌ని అన్న‌వాళ్లేన‌ని, అప్ప‌టికి కుదర‌క‌పోయినా భ‌విష్య‌త్‌తో త‌న‌కు ఛాన్సులిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. మొత్తానికి ఆ ముగ్గురిని త‌న‌దైన శైలిలో తిట్టేసి, త‌ర్వాత ఆలింగ‌నం చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఛాన్సిస్తామ‌ని రెండేళ్లు, మూడేళ్లు ఆగాల్సిందిగా కోరిన‌వాళ్ల‌ను, నువ్వేమైనా డ‌బ్బు పెడ‌తావా? అని అడిగిన వాళ్ల‌ను శంక‌ర్ ఎంతో ఆక్రోశంగా వేదిక‌పైనే సూటిగా ఏ దాప‌రికం లేకుండా తెలివిగా తిట్టి ప‌డేశాడు. స్టేజీ కింద ఉన్న ప్రెస్సోల్లంతా బావుంద‌య్యో శీకాకుళం శంక‌రం.. పిలిచి బాగానే గ‌డ్డి పెట్టావ్‌!! అని అనుకున్నారంతా.