కోమ‌టి రెడ్డి ప్లాన్ త‌ల‌కిందులు.. అస‌లేమైంది?

Friday, July 12th, 2019, 09:38:12 AM IST

తొంద‌ర పాటు నిర్ణ‌యాల వ‌ల్ల ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది. ఇప్పుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ప‌రిస్థితి ఇలాగే అవుతోందా? అంటే అవున‌నే చ‌ర్చ సాగుతోంది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో జెండా ఎగ‌రేయాల‌ని స్కెచ్ వేసిన బీజేపీ మాస్ట‌ర్ మైండ్ అమిత్ షా కాంగ్రెస్, టీడీపీ, తెరాస‌కు చెందిన ముఖ్య నాయ‌కుల్ని ఇప్ప‌టికే బీజేపీలోకి లాగేసుకున్నారు. మ‌రింత బ‌లాన్ని పెంచుకోవాల‌న్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికార పీఠాన్ని ద‌క్కించుకోవాల‌న్నా మ‌రికొంత మంది కీల‌క నేత‌ల్ని త‌మ పార్టీలోకి లాగాల్సిందే. ఇదే ప్లాన్‌తో బీజేపీ ఏపీ, తెలంగాణ‌లో పాగా వేయ‌డానికి అడుగులు వేయ‌డం మొద‌లుపెట్టింది.

దీంతో కీల‌క నేత‌లంతా బీజేపీ వైపు చూడ‌టం మొద‌లుపెట్టారు. అమిత్ షాతో మంత‌నాలు చేయ‌డం ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి మాత్రం ఏకంగా తాను బీజేపీలోకి వెళుతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. త‌న వ‌ర్గానికి చెందిన నేత‌తో కోమ‌టిరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌ని బీజేపీలోకి వెళ్ల‌కుండా చేస్తున్నాయ‌ని తెలుస్తోంది. తాను బీజేపీలోకి వెళితే భ‌విష్య‌త్ సీఎం తానే న‌ని చెప్ప‌డం స్థానిక‌ నేత‌ల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పించింద‌ట‌. దీంతో వాళ్లే కోమ‌టిరెడ్డి ఎంట్రీకి మొకాల‌డ్డేశార‌ని తాజా టాక్‌. ఇదే నిజ‌మైతే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డిగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌లో వుండ‌లేరు. బీజేపీలోకి రాలేక ఆయ‌న రాజ‌కీయ జీవితం ఒక విధంగా ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిన‌ట్టే అంటున్నారు.