కెసిఆర్ కోసం కాంగ్రెస్ నేతల పూజలు

Monday, September 15th, 2014, 11:39:20 AM IST


తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆదివారం సమక్క,సారమ్మలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో టిడిపి నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా టిడిపి నేత ఎర్రబిల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కెసిఆర్ కు సద్భుద్దిని ప్రసాదించాలని తాను సమక్క, సారమ్మలను వేడుకున్నానని తెలిపారు.

అలాగే కెసిఆర్ అవాస్తవాలు మాట్లాడకుండా చూడాలని, ఆయనకు కోపం, గర్వం తగ్గించాలని దేవతలను కోరుకున్నానని ఎర్రబిల్లి పేర్కొన్నారు. ఇక కెసిఆర్ తన వంద రోజుల పాలనలో వెయ్యి అబద్ధాలు ఆడారని ఆయన తెలిపారు. అలాగే తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు కేంద్రంపై వత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఇక టిడిపి నేతలకు మేడారం గిరిజన పూజారులు సాంప్రదాయ బద్ధంగా ఆహ్వానం పలికారు.