కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్..!

Friday, June 11th, 2021, 03:02:24 AM IST

తెలంగాణలో కరోనాను ఆరోగ్యశ్రీలోకి చేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆమె ప్రతి పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని, కరోనాతో బాధపడుతున్న పేదలు, మధ్య తరగతి కుటుంబాలు వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చి వారి ప్రాణాలను కాపాడాలని సీతక్క ప్రభుత్వాన్ని కోరారు.

ఇదిలా ఉంటే ములుగు ఏరియా ఆస్పత్రిలో డయాగ్నోసిస్‌ సెంటర్‌ను ప్రారంభించడం సంతోషకరమని సీతక్క అన్నారు. అయితే జిల్లాకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేయకపోవడం బాధాకరమని, కనీసం నర్సింగ్‌ కళాశాలనైనా మంజూరు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. పర్యాటక ప్రాంతాలైన రామప్ప, లక్నవరం, మేడారం, బొగత ఉన్నప్పటికీ అభివృద్ధిలో ములుగు జిల్లా వెనుకబాటులో ఉందని దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.