కేటీఆర్‌ని సీఎం చేసేందుకు కేసీఆర్‌ ఈటలను బలిచేశారు – జీవన్ రెడ్డి

Sunday, May 2nd, 2021, 03:00:07 AM IST

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్, తాజాగా ఈటల నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా ఆయనను తప్పించి దానిని తాను తీసుకున్నారు. అయితే దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అడ్డుగా మారాడనే ఈటలపై వేటు వేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ తొలినాళ్ళ నుండి కేసీఆర్‌కు ఈటల, హరీష్ అండగా నిలిచారని మిగతా వాళ్లంతా బయట నుంచి వచ్చిన వారేనని అన్నారు.

అయితే ఎర్రవల్లిలో సీఎం వ్యవసాయ క్షేత్రం కోసం భూములు గుంజుకోలేదా అని ప్రశ్నించారు. ధరణిలో ముఖ్యమంత్రి భూములు కనిపించవని జీవన్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి భూ దందాపై దమ్ముంటే విచారణ చేయాలన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెరువులు కబ్జా చేస్తే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే కరోనా సమయంలో ఈటల బాధ్యతతో పనిచేశారని జీవన్ రెడ్డి అన్నారు.