కాంగ్రెస్ పార్టీనే తెలంగాణాని నాశనం చేసిందన్న కేసీఆర్

Monday, June 10th, 2013, 02:27:45 PM IST


తెరాస అధ్యక్షుడు కెసిఆర్ గత కొద్దికాలంగా ఎ సమావేశానికి వెళ్ళినా, ఎక్కడ మైక్ పట్టుకున్నా కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్ష నేతల్ని ఏకిపారేస్తున్నారు. నిన్న కెసీఆర్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మాజీ ఉపముఖ్యమంత్రిగా కొనసాగి స్వర్గస్తులైన కొండా వెంకటరంగారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన మనవడు అయిన విశ్వేశ్వర్ రెడ్డిని తెరాసలోకి ఆహ్వానించారు.

ఆ తర్వాత సభలో ప్రసంగించిన కేసీఆర్ ‘ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే తెలంగాణాను నాశనం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని పదవులను, ఆధిపత్యాన్ని ఆంధ్రావాళ్ళకే ఇచ్చింది. ఇంకెన్నాళ్ళు తెలంగాణ ప్రజలు గులాంగిరీ చేయాలి. ఏఐసీసీకి ఆ మాత్రం సోయి లేదా?’ అని ప్రశ్నించారు. అలాగే ‘టీడీపి, వైసీపీ లాంటి ఆంధ్రా పార్టీలను బొందలో పెట్టాలి. ఆంధ్రా పార్టీ నేతలు సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్లా వస్తారు అది చూసి మీరు మోసపోవద్దు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని లక్షలక ఎకరాల భూమి ఆంధ్రా వాళ్ళ చేతిలో ఉంది. తెలంగాణ రాగానే వాటిని వారి నుంచి లాక్కొని తెలంగాణ పేద ప్రజలకి పంచుతానని’ ఆయన తెలిపారు.