పీసీసీ చీఫ్ కావాలంటే ఆ పని చెయ్యి.. రేవంత్ కి తేల్చిచెప్పిన కాంగ్రెస్

Tuesday, September 10th, 2019, 07:27:05 AM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గురించి తెలంగాణాలో చాప కింద నీరులా మెల్ల మెల్లగా చర్చ జరుగుతూనే ఉంది. తెలంగాణాకి కొత్త గవర్నర్ రావటం,దానికి తోడు కెసిఆర్ మంత్రి వర్గ విస్తీరణ జరగటంతో అందరి దృష్టి అటు వైపు మళ్లింది కానీ, అంతకు ముందు రేవంత్ రెడ్డి గురించి పెద్ద స్థాయిలోనే చర్చ నడుస్తుంది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖాయమనే వార్తలు రావటంతో రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీ తో కలిసి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిశాడు.

అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కకుండా చేయవలసిన పనులు అన్ని చేస్తున్నారు. దీనితో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి విషయంలో కొంచం వెనక్కి తగ్గింది. అయితే పూర్తిగా ఆ విషయాన్నీ మాత్రం పక్కన పెట్టలేదు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో ఒక యూనిటీ అనేది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తమ దారి తాము చూసుకుంటామని సీనియర్లు హెచ్చరించటంతో కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు.

పార్టీలోని సీనియర్ నేతలను ఒప్పించి, వాళ్ళ పూర్తి అంగీకారంతో వస్తే నీకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తుంది. పార్టీలోని అన్ని వర్గాలు కలిసి పనిచేస్తేనే అధికారం అందుంటుంది. ఆలా కాకుండా ఇలా వర్గాలుగా పనిచేస్తే మొదటికే మోసం వస్తుంది. నీ విషయంలో అందరు కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చేలా చేసుకోవటం నీ బాధ్యత. కాబట్టి సీనియర్లతో మంతనాలు జరిపి ఈ విషయాన్నీ ఒక కొలిక్కి తీసుకోనిరా అంటూ రేవంత్ రెడ్డికి అధిష్టానం చెప్పినట్లు తెలుస్తుంది. దీనితో ప్రస్తుతం రేవంత్ రెడ్డి తన పరిచయాలు ఉపయోగించి కాంగ్రెస్ పెద్దలను ఒప్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.