వెన్నుపోటు అంటే నిజంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలదే..!

Thursday, June 6th, 2019, 04:21:55 PM IST

తెలంగాణలో ఈ సారి జరిగిన ముందస్తు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా రెండో సారి తెలంగాణ ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారాన్ని చేపట్టారు. అయితే టీఆర్ఎస్ పార్టీనీ ఎలాగైనా ఓడించి ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో సహా, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా విస్తృత ప్రయత్నం చేశారు. అందుకోసం టీడీపీ, జనసమితి, సీపీఐ పార్టీలతో పొత్తును కూడా పెట్టుకున్నారు.

అయితే పొత్తులో భాగంగా కొన్ని సీట్లను వదులుకోవాల్సి వచ్చినా కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో గెలుపును దక్కించుకోలేకపోయింది. కేవలం 19 స్థానాలను మాత్రమే గెలుచుకుని ఘోరంగా ఖంగుతింది. అయితే గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలు కూడా ఒకరి తరువాత ఒకరు టీఆర్ఎస్‌లోకి వలసలు కట్టి మరీ జంప్ అయ్యారు. దాదాపు 19 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. అయితే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్గొండ ఎంపీగా గెలుపొందడంతో తన ఎమ్మెల్యే పదవికి నిన్న రాజీనామా చేశారు. ఇక తాజాగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్టు సమాచారం. నేడు ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తెరాసలో చేరికపై చర్చించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇక మిగిలింది 5 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. అయితే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలంతా కలిసి సీఎల్పీని తెరాసలో విలీనం చేయాలంటూ గురువారం తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు 12 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని కూడా స్పీకర్‌కు అందజేశారు. అయితే దానిని స్పీకర్ ఆమోదిస్తే మాత్రం శాసనసభలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళి సొంత పార్టీకి విపక్ష హొదాను మిగిల్చారని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు వీరిపై మండిపడుతున్నారట.