కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. వరద బాధితులకు 50 వేలు..!

Tuesday, November 24th, 2020, 03:16:29 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. హాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఆ పార్టీ నేతలు ఠాగూర్‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి‌, భట్టి విక్రమార్క విడుదల చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీనీ గెలిపిస్తే వరద బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. వరదల వలన పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2.5 లక్షలు ఇస్తామని తెలిపింది. వరదల్లో చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది.

అంతేకాదు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని, మెట్రో సేవలు పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్టు వరకూ పొడిగిస్తామని, ఎంఎంటీఎస్‌, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపింది. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని, 80 గజాలలోపు ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు చేస్తామని ప్రకటించింది. 100 యూనిట్ల లోపు గృహాలకు ఉచిత కరెంట్ అందిస్తామని, ప్రతి కుటుంబానికి 30 వేల లీటర్ల ఉచిత మంచినీరు అందిస్తామని తెలిపింది.