బిగ్ షాక్: గ్రేటర్‌లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ

Monday, May 3rd, 2021, 04:10:34 PM IST

గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. లింగోజిగూడ డివిజన్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకుండానే కరోనా బారిన పడి మరణించారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. అయితే కొందరు బీజేపీ ముఖ్య నేతలు మంత్రి కేటీఆర్‌ని కలిసి టీఆర్ఎస్ తరఫున ఎవరిని పోటీలో పెట్టవద్దని రిక్వెస్ట్ చేయడంతో టీఆర్ఎస్ కూడా ఎవరిని పోటీలో నిలపలేదు. దీంతో తమ సిట్టింగ్ స్థానం మళ్లీ తమకే దక్కుతుందనుకున్న బీజేపీకి అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది.

అయితే ఏప్రిల్ 30న లింగోజిగూడ డివిజన్‌కు ఉప ఎన్నిక జరగగా నేడు దాని ఫలితం వెల్లడయ్యింది. అయితే లింగోజిగూడ ఉప ఎన్నికలో బీజేపీ మందుగుల అఖిల్‌ పవన్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నుంచి దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా చాలిక చంద్రశేఖర్‌, జల్ల నాగార్జున, షేక్‌ ఫర్వేజ్‌ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. దీంతో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా, కాంగ్రెస్ మాత్రం గ్రేటర్‌లో తమ బలాన్ని మూడుకు పెంచుకుంది.