రేవంత్‌కి పీసీసీ పదవి కష్టమే.. పార్టీలో మరో అడ్డంకి..!

Sunday, December 15th, 2019, 01:27:49 AM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం పీసీసీ చీఫ్ గొడవ మొదలయ్యింది. అయితే మొదటి నుంచి పీసీసీ పదవి రేవంత్ రెడ్డికి దక్కుతుందని భావించినా ఆయనకు ఆ పదవి దక్కకుండా పార్టీలో అడ్డంకులు పెరిగిపోతున్నాయి. రెండేళ్ళ క్రితం టీడీపీనీ వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌కి కాంగ్రెస్ సీనియర్లకు అసలు సఖ్యత కుదరడం లేదు. పార్టీలో సీనియర్ నాయకులైన జానారెడ్డి, కోమటిరెడ్డి, షబ్బీర్ అలీ, హనుమంత రావు లాంటి నేతలు మొదటి నుంచి రేవంత్ పట్ల వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు.

అయితే రేవంత్‌కి పీసీసీ దక్కకుండా నిన్న మొన్నటి వరకు వీరంతా అడ్డుపడితే తాజాగా పార్టీలో ఇప్పుడు మరికొందరు నేతలు అడ్డుపడుతున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్‌లో,వీధుల్లో పోరాడిన నేతలకే టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్,బలరాంనాయక్,సిరిసిల్ల రాజయ్యలు ఢిల్లీలో సోనియాను కలిసి ఈ డిమాండ్ వినిపించారు. అయితే వీరంతా బీసీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, అటు సీనియర్ నేత హనుమంతరావు కూడా బీసీ, ఎస్సీలకు పీసీసీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో అధిష్టానం దీనిపై మళ్ళగుళ్ళాలు పడుతుంది. అయితే ఇలాంటి నేపధ్యంలో సీనియర్ల ఒత్తిళ్ళ వలన పీసీసీ నుంచి అధిష్టానం రేవంత్‌ని సైడ్ చేస్తుందా లేక సీనియర్లకు నచ్చచెప్పి రేవంత్‌కే పీసీసీ కట్టబెడుతుందా అనేదే టీ కాంగ్రెస్‌లో ఇప్పుడు పెద్ద చర్చానీయాంశంగా మారిపోయింది.