మ్యాస్ట్రో `ప‌ద్మ‌విభూష‌ణ్‌`పై కులం రంకె!!

Saturday, January 27th, 2018, 11:33:09 AM IST

నిన్న‌నే మ్యాస్ట్రో ఇళ‌య‌రాజాకు ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించింది కేంద్ ప్ర‌భుత్వం. సంగీత సుస్వ‌ర సామ్రాజ్యంలో ఒక లెజెండ్‌కి ఇలాంటి అవార్డు ప్ర‌క‌టించ‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మైంది. రాజా అభిమానుల్లో ఒక‌టే కేరింత‌లు క‌నిపించాయి. ముఖ్యంగా త‌న‌పై కేసు పెట్టినా.. ఇళ‌య‌రాజాపై త‌న‌కు ఉన్న అవిభాజ్య ప్రేమ‌ను మ‌రోసారి ప్ర‌క‌టించుకుంటూ ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం చేసిన వ్యాఖ్య ఆస‌క్తి రేకెత్తించింది. ఇళయరాజాను వరించి ‘పద్మవిభూషన్’ గుర్తింపు పొందింది..! అంటూ ఎస్పీబీ అభినందించారు. ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచారు.

అదంతా అటుంచితే.. ఓ ఆంగ్ల ప‌త్రిక నేడు ఎలాంటి హెడ్డింగ్‌తో వార్త ప్ర‌చురించిందో తెలిస్తే అవాక్క‌వ్వ‌కుండా ఉండ‌లేరు. `ద‌ళిత్ ఔట్ రీచ్ విత్ ఇళ‌య‌రాజాస్ ప‌ద్మ‌` .. అన్న బ్యాన‌ర్‌ టైటిల్ తో స‌ద‌రు ప‌త్రిక ప‌ద్మ అవార్డుల్ని, ఇళ‌య‌రాజాని అవ‌మానించిన తీరు క‌ల‌క‌లం రేపింది. `ప‌ద్మ‌` అవార్డుల్లో కులం ప్ర‌ధాన పాత్ర పోషించింద‌న్న‌ది స‌ద‌రు హెడ్డింగు లో మీనింగు. అయినా ఇళ‌య‌రాజాకు అవార్డునిస్తే ద‌ళితులు ఓట్లేస్తారా? పోసాని అయితే స‌ద‌రు ప‌త్రిక అవిజ్ఞాన‌క‌ర హెడ్డింగును ఎలా తిట్టేవాడో తెలీదు కానీ, రాజా అభిమానులు మాత్రం పెట్రోల్ యాడెడ్ టు ద ఫైర్‌! అన్న చందంగా చెల‌రేగిపోయి తిట్టేస్తున్నారు. అయినా ఇళ‌య‌రాజా కులం చూసి కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌విభూష‌ణ్ ఇచ్చి స‌త్క‌రించిందా? రాజా ప్ర‌తిభ‌కు కులం గీటురాయిగా మారిందా? ఎంత‌టి అవిజ్ఞానం అంటూ తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేస్తున్నారు. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ సునీల్ జైన్ ఈ వివాదంపై వివ‌ర‌ణ‌నిస్తూ .. కులాన్ని ఆపాదిస్తూ ఇళ‌య‌రాజాకు ప‌ద్మ‌విభూష‌ణ్ ఇచ్చార‌ని స‌ద‌రు ఆంగ్ల ప‌త్రిక పేర్కొన‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. త‌మిళ ప్ర‌జ‌లపై ప్ర‌ధాని మోదీ గౌర‌వానికి ఇది సూచిక‌గా భావించాల‌ని ఆయ‌న అన్నారు. కులం కూడు పెట్ట‌క‌పోయినా చిచ్చు పెడుతోంది అన‌డానికి ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ కావాలా? ద‌శాబ్ధాలుగా త‌న‌వైన సుస్వ‌రాల‌తో అల‌రించిన మేటి సంగీత ద‌ర్శ‌కుడికి ప‌ద్మ‌విభూష‌ణ్ ఇస్తే త‌ప్పొచ్చిందా? ఎందుకూ ప‌నికి రానివారికి అవార్డులిప్పిస్తున్న ప్ర‌భుత్వాలు ఉన్న ఈ లోకంలో మోదీ త‌ప్పు చేశాడంటారా? ఎవ‌రైనా ఈ ప‌ద్మాన్ని ఖండించ‌గ‌ల‌రా?