పీలేరులో తొలి కరోనా కేసు నమోదు – అప్రమత్తమైన అధికారులు

Tuesday, May 26th, 2020, 08:55:30 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ నివారణకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని నివారణ చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈ మహమ్మారి వైరస్ అంతకంతకు పెరగడంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. ఇకపోతే పీలేరులో పలమనేరు ప్రైమరీ కాంటాక్టు వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా ఢిల్లీ నుంచి అనంతపురం, పలమనేరు మీదుగా పీలేరుకు వచ్చిన వ్యక్తి పలమనేరుకు చెందిన ఓ యువతి ప్రైమరీ కాంటాక్టుగా అధికారులు గుర్తించి, ఆ వ్యక్తిని చిత్తూరులోని కోవిద్ ఆసుపత్రికి తరలించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఆ వ్యక్తికి జరిపినటువంటి కరోనా నిర్దారిత పరీక్షల్లో, కరోనా పాజిటివ్ అని వెల్లడవడంతో, అధికారులు అధికారికంగానే ప్రకటించారు. కాగా ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి, ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డుల్లో అత్యవసరమైన చికిత్సని అందిస్తున్నారు. అంతేకాకుండా ఆ వ్యక్తికి సంబందించిన ఇంటి పరిసరాలను రెడ్ జోన్ గా ప్రకటించి, ఆ ఇంటి పరిసరాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టారు. దానికితోడు ఆ ఇంటికి సంబంధించి, దాదాపుగా 200 మీటర్ల పరిసరాలను అదుపులోకి తీసుకుని రాకపోకలను నిర్బంధం చేసి, కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.