రెవెన్యూ శాఖ అవినీతిమయం

Wednesday, September 17th, 2014, 04:12:32 PM IST


ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బుధవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తన వద్దకు వచ్చే ఫైళ్లన్నీ సస్పెన్షన్లు, డిస్మిస్ లే ఉంటున్నాయని కృష్ణమూర్తి వివరించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో రెవెన్యూ శాఖదే కీలకపాత్ర అని అభిప్రాయపడ్డారు. అలాగే రాజధాని భూసేకరణ మంత్రివర్గ ఉపసంఘంలో తనను ఉండమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగినా తాను నిరాకరించానని మంత్రి తెలిపారు. ఇక రాజధాని భూసేకరణ ఎలా ఉండాలన్న విషయమై అందరి అభిప్రాయాలు తీసుకుంటామని, దీని కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేశామని కృష్ణమూర్తి వివరించారు. అలాగే 32వేల ఎకరాల భూములను పరిశ్రమలు, విద్యాసంస్థలు ఏర్పాటుకు కేటాయించనున్నామని మంత్రి తెలిపారు. ఇక దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ‘ఈ-పాస్ బుక్’ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని, అక్టోబర్ 2 నుండి ఆన్ లైన్లో పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.