టీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. పొత్తుపై వెనకడుగు వేసిన సీపీఐ..!

Wednesday, October 9th, 2019, 10:34:24 PM IST

హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు. అయితే ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందడంతో హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 21న ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ పద్మావతి, అధికార పార్టీ నుంచి సైది రెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావ కిరణ్మయి, తీన్మార్ మల్లన్న వంటి వారు ముఖ్యంగా బరిలో ఉన్నారు.

అయితే గతంలో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానం కాబట్టి అటు కాంగ్రెస్, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ రెండు ఈ స్థానం కోసం గట్టిగానే పోటీ పడుతున్నాయి. అయితే హుజూర్‌నగర్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ సీపీఐ పార్టీనీ మద్ధతు కోరగా అందుకు సీపీఐ కూడా ఒకే చెప్పడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అయితే తాజాగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడం, దానికి టీఆర్ఎస్ వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంతో ఉద్యమ పార్టీగా ఉన్న సీపీఐ ఆర్టీసీ కార్మికులకు మద్ధతు తెలుపుతుంది. ఆ మేరకే హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌తో పొత్తు కొనసాగించాలా వద్దా అనే దానిపై సీపీఐ పార్టీ పునరాలోచన చేస్తామని ఇటీవల ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేసారు. అంతేకాదు ఆర్టీసీనీ ప్రైవేటీకరణ చేస్తే తాము కూడ సహించబోమని అన్నారు.