గ‌డ్డిపోచ‌ల్ని ముడివేస్తున్న కొడ‌వ‌లి పార్టీ!

Sunday, September 23rd, 2018, 11:45:17 PM IST

గ‌డ్డి పోచ గ‌డ్డిపోచ ముడివేసి ఏనుగును బంధించిన చందంగా పార్టీల‌న్నీ ఏక‌మై తేరాస కుంభాన్ని కొట్టేందుకు మ‌హాకూటమిగా ఏర్ప‌డ్డాయి. ఈ గ‌డ్డిపోచ‌ల‌న్నీ ఏక‌మై కేసీఆర్‌ అనే ఏనుగును బంధించే ప‌నిలో ఉన్నాయి. అయితే ఇది నెర‌వేరేదేనా? తేరాస అధినాయ‌కుడి ప‌న్నాగాల ముందు, తొండం బ‌లం ముందు గ‌డ్డిపోచ ప‌న్నాగం పారుతుందా? ప‌్ర‌స్తుతం ఇదో హాట్ డిస్క‌ష‌న్‌.

కాంగ్రెస్ -తేదేపా- టీజేఎస్ (కోదండ‌రామ్‌) – సీపీఐ క‌లిసి తేరాస‌ను ఓడించాల‌ని మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ్డాయి. అయితే ఇందులో సీపీఎం మాత్రం చేతులు క‌ల‌ప‌లేదు. దీంతో ఆ పార్టీ ఆలోచ‌న ఏంటో అర్థం కాక అంతా గంద‌ర‌గోళంలో ప‌డ్డారు. స‌రిగ్గా ఆ టైమ్‌లోనే సీపీఎం పార్టీ తెలంగాణ‌లో జ‌న‌సేన‌ను, బీఎల్ఎఫ్ బ‌హుజ‌న స‌మితి పార్టీల‌ను క‌లుపుకుని వేరొక మినీ కూట‌మి ఏర్పాటున‌కు స‌న్నాహాలు చేస్తోంది. అయితే మ‌హాకూట‌మితో పోలిస్తే ఇది చాలా చిన్న కూట‌మి. అందుకే మ‌హాకూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ఎవ‌రికైనా సీపీఎం పార్టీ వెల్ కం చెబుతోంది. ఇక ఇప్ప‌టికే మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్ధుబాటు విష‌య‌మై బోలెడంత లొల్లి న‌డుస్తోంది. అక్క‌డ కోదండ‌రామ్ ఇమ‌డ‌టం అన్న‌ది అసాధ్యం అని చెబుతున్నారు. అలాంటి వేళ కోదండ‌ను లైన్‌లో పెట్టేందుకు సీపీఎం చాలానే ప‌న్నాగం ప‌న్నిందిట‌. ఈనెల 25న కోదండ‌రామ్ మ‌హాకూట‌మి లో ఉంటారా.. ఉండ‌రా.. అన్న‌ది తేల‌నుంది. ఆయ‌న మ‌హాకూట‌మిలో ఇమ‌డ‌క‌పోతే త‌మ కూట‌మిలో చేర‌మ‌ని అడిగేందుకు సీపీఎం కాపు కాసుకుని కూచుందిట‌. మ‌హా కూట‌మితో పోలిస్తే సీపీఎం ఏర్పాటు చేసే కూట‌మి చాలా చిన్న‌ది. చాలా త‌క్కువ సీట్ల‌ను మాత్ర‌మే ద‌క్కించుకుంటుంద‌ని అంచ‌నా ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ కూట‌మితో కోదండ క‌లుస్తారా? కాంగ్రెస్ జ‌ట్టు వీడితే కోదండ‌రామ్‌కి క‌లిసొచ్చేదెంత‌? అంటూ విశ్లేష‌ణ‌లు జోరందుకున్నాయి. ఇక తేదేపా, సీపీఐ కాంగ్రెస్‌ని వీడేందుకు సిద్ధంగా లేవ‌న్న మాటా వినిపిస్తోంది.