పార్టీ మార్పుపై దామోదర రాజనర్సింహ పక్కా క్లారిటీ..!

Friday, August 23rd, 2019, 11:00:13 PM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పోయిన టీఆర్ఎస్ ఈ సారి కూడా భారీ మెజారిటీతో గెలిచి వరుసగా రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే లోక్‌సభ ఎన్నికలలో మాత్రం టీఆర్ఎస్ అనుకున్న స్థానాలను గెలుచుకోలేకపోయింది. అయితే లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 4 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలను గెలుచుకుంది.

అయితే పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, మరికొంత మంది నేతలు కాంగ్రెస్ పార్టీనీ వీడి టీఆర్ఎస్, బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆంధోల్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓటమిపాలైన సీనియర్ నాయకుడు దామోదర రాజనర్సింహ పార్టీనీ వీడుతున్నారని ఆయన రేపు అమిత్‌షా పర్యటనలో కాషాయ కండువా కప్పుకోనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ ఎన్నికలకు ముందు ఆయన భార్య బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌లో దామోదరకు మంచి పేరు ఉండడంతో ఆమెను రాత్రికి రాత్రే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. అయితే ఆ సంఘటనను పరిశీలిస్తే వీరికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయని అందుకే బీజేపీలోకి వెళుతున్నారని అందరూ అనుకున్నారు. అయితే ఈ వార్తలపై స్పందించిన దామోదర రాజనర్సింహ తాను ఏ పార్టీలో చేరడం లేదని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు.