ద‌ర్శ‌క‌ర‌త్న ఇంట ఆస్తి గొడ‌వ‌

Tuesday, September 11th, 2018, 01:10:07 PM IST

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి ఇంట ఆస్తి వివాదం ర‌చ్చ‌కెక్క‌డం సంచ‌ల‌న‌మైంది. దాస‌రి పెద్ద కోడ‌లు సుశీల జూబ్లీహిల్స్‌లోని దాస‌రి ఇంటిలోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో త‌న‌ని ఇత‌ర కుటుంబ స‌భ్యులు అడ్డుకున్నారు. దీంతో సుశీల పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అటుపై నిన్న‌టి సాయంత్రం మ‌హిళా సంఘాలు, పోలీసుల‌తో క‌లిసి సుశీల దాస‌రి ఇంటి ముందు నిర‌స‌న‌కు దిగారు. దాస‌రి చిన్న కుమారుడు అరుణ్‌కుమార్, ఆయ‌న భార్య‌పై సుశీల తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కొచ్చింది.

దాస‌రి ఆస్తిలో త‌న‌కు వాటా ఉంద‌ని, త‌న కుమారుడిని హీరోని చేస్తాన‌ని మామ మాటిచ్చార‌ని సుశీల ఈ సంద‌ర్భంగా చెప్పారు. దాస‌రి పెద్ద త‌న‌యుడు తార‌క్ ప్ర‌భుతో 1995లో త‌న‌కు వివాహం జ‌రిగింద‌ని, మామ దాస‌రి పంజాగుట్ట‌లో త‌మ‌కు ఓ ఇల్లు ఇచ్చార‌ని సుశీల చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆ ఇంటినుంచి త‌న‌ని త‌రిమేశార‌ని ఆరోపించారు. ఈ వివాదం విష‌యంలో న‌టుడు మోహ‌న్‌బాబు త‌న‌కు అండ‌గా నిలిచి సెటిల్ చేస్తాన‌ని ఇప్పుడు ముఖం చాటేస్తున్నార‌ని ఆరోపించారు. భ‌ర్త తార‌క్ ప్ర‌భు నుంచి విడిపోయేందుకు విడాకులు ద‌ర‌ఖాస్తు చేశాన‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని, ఆధారాలు ఉంటే నిరూపించాల‌ని సుశీల‌ స‌వాల్ విసిరారు. త‌న భ‌ర్త‌ను డ‌మ్మీని చేసి ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఆడించ‌డంపైనా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దాస‌రి పోయి ఏడాది అవ్వ‌గానే ఇలా ముస‌లం మొద‌ల‌వ్వ‌డంపై దాస‌రి శిష్యులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అంత‌టి పెద్దాయ‌న ప‌రువు న‌డిబ‌జారుకీడ్చ‌డంపైనా చ‌ర్చ సాగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments