తెలుగు సినిమా పాట ఎటెళ్తోంది?

Thursday, September 13th, 2018, 03:36:43 PM IST

దేవుళ్ల పాట‌ల‌న్నీ ఒకేలా ఉండ‌వు! అని చెప్పుకునేందుకు ఒక్క పాట కూడా లేదు. టాలీవుడ్‌లో అనాదిగా ఇదే పంథా. దేవుళ్ల‌పై పాట అంటేనే మూసలో ఉంటుంది. ఇదివ‌ర‌కూ ఎపుడో వినేసిన ట్యూన్‌లాగా ఫార్ములాటిక్‌గా వినిపిస్తున్నారు ప్ర‌తిసారీ. ఆ కోవ‌లోనే ఇదిగో లంబోద‌రుడు గ‌ణేషునిపై మ‌రో పాట రిలీజైంది. ఇదివ‌ర‌కూ ఎన్నో సినిమాల్లో ఈ త‌ర‌హా ట్యూన్ వినిపించింది. అవే డ‌ప్పులు.. ద‌రువులు.. వాణి- బాణి మ‌రోసారీ.. దేవ‌దాస్ రూపంలో!

ల‌క‌ల‌క‌ల‌కుమిక‌రా.. అంటూ సాగుతున్న ఈ పాట‌ను వినాయ‌క‌చ‌వితి కానుక‌గా `దేవ‌దాస్` టీమ్ రిలీజ్ చేసింది. ఈ సినిమాని నిర్మిస్తున్న వైజ‌యంతి మూవీస్ సంస్థ అధికారిక ట్విట్ట‌ర్‌లో ఈ వీడియో సాంగ్‌ని పోస్ట్ చేసింది. లిరిక్ ఎంత రొటీన్‌గా ఉందో ద‌రువు కూడా అంతే రొటీన్‌గా ఉంద‌ని ఎవ‌రిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్‌ నాని ఈ పాట‌లో వైబ్రేంట్‌గా క‌నిపిస్తున్నా… రంగుల ఉత్స‌వంలో రంగులు పులుముకుని అద్భుతంగా నాట్యం చేస్తున్నా ఎందుక‌నో ఎలివేష‌న్ మాత్రం చాలా పాత‌గా క‌నిపిస్తోంది. ప్ర‌తి ట్యూన్‌లో ఏదో ఒక కొత్త‌ద‌నం కావాల‌ని త‌పించే త‌త్వం నేటి జ‌న‌రేష‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో చాలా త‌క్కువ‌గానే చూడ‌గ‌లం. ఇక ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమా సంగీతంలో సృజ‌నాత్మ‌క‌త పాళ్లు ఎంత త‌గ్గిపోయాయో విడిగా చెప్పాల్సిన ప‌నేలేదు.

దేవ‌దాస్ చిత్రంలో నాగార్జున లుక్‌, నాని లుక్‌కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. దేవా, దాస్ తాగి ప‌డిపోయే బ్యాచ్ అని అంద‌రికీ అర్థ‌మైంది. అందులో హ్యూమ‌ర్ వ‌ర్క‌వుటైంది. ఇటీవ‌లే లాంచ్ చేసిన టీజ‌ర్‌కి స్పంద‌న బావుంది. పండ‌గ‌ల వేళ సింగిల్స్‌ని రివీల్ చేస్తూ ప్ర‌చారంలో వేడి పెంచుతున్నారు. తాజా సింగిల్‌లో దేవా, దాస్‌లోని భ‌క్తి కోణాన్ని ఎలివేట్ చేసి ఈ కోణం కూడా ఉందా? అన్న ప్ర‌శ్న‌కు తావిచ్చారు. ఇక‌పోతే ఈ చిత్రానికి గోపిసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబ‌ర్‌లో `దేవ‌దాస్` ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments