చంద్రబాబు పేరు చెబితే వదిలేస్తానన్నారు.. సీఐడీపై దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు..!

Friday, April 30th, 2021, 03:00:32 AM IST

ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్‌ కేసుపై టీడీపీ నేత దేవినేని ఉమను నేడు సీఐడీ విచారించింది. దాదాపు 9 గంటల పాటు దేవినేని ఉమను ప్రశ్నించిన సీఐడీ అధికారులు మే 1న మరోసారి విచారణకు హాజరుకావాలని సూచించారు. అయితే విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఐడీ అధికారుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చంద్రబాబు నాయుడే ఆ వీడియోను చేయించారని చెప్పామన్నారని, అలా చెబితే మధ్యాహ్నమే తనను పంపిస్తామని అన్నారని విమర్శించారు.

అయితే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోపై మీడియాతో మాట్లాడితే ఇంత రాద్దాంతమా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన దేవినేని అక్రమ కేసులకు తాను భయపడనని అన్నారు. కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని సీఎం జగన్ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నార‌ని, తన పైశాచిక ఆనందం కోసమే తప్పుడు కేసులు పెడుతూ టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తనను అరెస్టు చేయ‌కూడ‌ద‌ని హైకోర్టు ఆదేశాలు ఉండడంతోనే బయటకు వచ్చానని, లేకపోతే తనను రాజమండ్రి జైలుకు పంపించేవారని ఉమ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.