ఆ సినిమా నుండి తప్పుకున్న దేవిశ్రీప్రసాద్?

Tuesday, May 22nd, 2018, 02:19:51 PM IST

సినిమాల్లో ఒక్కోసారి ముందుగా కొందరిని తీసుకోవడం, తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళని ఆ సినిమా నుండి తప్పించడం వంటి ఘటనలు అక్కడక్కడా సినీ పరిశ్రమలో జరుగుతూ ఉంటాయి. అలానే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఒక సినిమా నుండి దేవి శ్రీ ప్రసాద్ ని తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. విషయం ఏమిటంటే, యంగ్ హీరో రామ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు నిర్మాతగా సినిమా చూపిస్త మామ, నేను లోకల్ చిత్రాల దర్శకుడు త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న నూతన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఇందులో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకులనుండి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా విషయంలో ప్రస్తుతం ఒక పుకారు షికారు చేస్తోంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఏమి జరిగిందో ఏమో తెలియదు గాని హఠాత్తుగా ఈ సినిమానుండి దేవి ని తొలగించి థమన్ ని తీసుకున్నట్లు సమాచారం. దిల్ రాజు, దేవి మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగానే దేవిని ఈ సినిమానుండి తప్పించారని అంటున్నారు. కాగా ఇదివరకు దిల్ రాజు బ్యానర్ లో పలు విజయవంతమైన చిత్రాలకు మ్యూజిక్ అందించిన దేవి ఇటీవల ఆయన బ్యానర్ లో వచ్చిన డీజే, ఎంసీఏ, నేను లోకల్ చిత్రాలకు సంగీతం అందించాడు. అయితే ఈ విషయమై యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడితేతప్ప ఈ వార్త నిజమో కాదో చెప్పలేము. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది….

  •  
  •  
  •  
  •  

Comments