వర్మ ఆఫర్ కు నో చెప్పిన అర్జున్ రెడ్డి?

Tuesday, March 13th, 2018, 10:24:17 PM IST


పెళ్లిచూపులు చిత్రం తో మంచి విజయం అందుకున్న విజయ్దేవరకొండ, తరువాతి చిత్రం ద్వారక పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. అయితే ఆ తర్వాత సందీప్ రెడ్డి తో చేసిన అర్జున్ రెడ్డి అనూహ్యంగా సూపర్ డూపర్ హిట్ సాధించి విజయ్ ని మంచి స్టార్ గా నిలబెట్టింది. అయితే మొన్న విడుదలయిన ఆయన చిత్రం ఏం మాత్రం వేసావే మాత్రం ప్లాప్ టాక్ మూటగట్టుకుందని చెప్పాలి. ఆయన మాత్రం తదుపరి తాను చేయబోయే చిత్రాలపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక విషయం ఏంటంటే హీరోలను తనదైన మాస్ రఫ్ లుక్లో చూపించడం అంటే అది కేవలం రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా అని ఒప్పుకు తీరాల్సిందే.

శివ, గాయం, సత్య వంటి చిత్రాల్లో ఆయన హీరోలను తీర్చిదిద్దిన తీరు అద్భుతమని చెప్పాలి. అటువంటి వర్మ చేతిలో పడితే సక్సెస్ రాకున్నా నటనలో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని చాలామంది ఆయన ఎప్పుడు ఆఫర్ ఇస్తారా అని ఎదురుచూస్తుంటారు కూడా. ఒకప్పుడు జగపతి బాబు వాయిస్ బాగోలేదని మొదట్లో ఆయనకు వాయిస్ ఓవర్ ఇప్పించేవారు. కానీ వర్మ గాయం సినిమాలో జగపతికి వాయిస్ ఓవర్ అవసరం లేదని చెప్పి సినిమాకు జగపతి వాయిస్ హైలెట్ అయ్యేలా చేశారు. ఇక జెడి చక్రవర్తి లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో ప్రయోగాలు చేసి బాలీవుడ్ లోకి తీసుకెళ్లి తీసిన సత్య సినిమా అప్పట్లో హిందీ బాక్స్ ఆఫీస్ హిట్ అని చెప్పాలి.

అదే తరహాలో విజయ్ దేవరకొండను కూడా వర్మ నార్త్ సైడ్ తీసుకెళ్లాలని అనుకున్నారట. ఇటీవల విజయ్ ని కలిసిన వర్మ విజయ్ తో ఒక చిత్రం ప్లాన్ చేశారట. కానీ విజయ్ మాత్రం ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అర్జున్ రెడ్డి సినిమా ప్రమోషన్స్ లో వర్మకు కూడా కొంత క్రెడిట్ ఉందని, సినిమా సక్సెస్ లో అయన కూడా మంచి భూమిక పోషించారని తెలుస్తోంది. కానీ దేవరకొండకు వర్మతో ప్రయోగం చేయడం ఇష్టం లేదని టాక్. అందుకే సింపుల్ గా, సార్ నేను సౌత్ లో చేసుకుంటా, హిందీ సంగతి తరువాత చూద్దాం అని చెప్పేశాడట.

ఇది ఎంతవరకు నిజమో తెలియదుగాని, ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం వర్మ ఆఫీసర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత లక్మిస్ ఎన్టీఆర్ తీయాలని అనుకున్నప్పటికీ ఆ సినిమాకు బ్రేక్ పడింది. మరి వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో చూడాలి…

  •  
  •  
  •  
  •  

Comments