మొబైల్, బ్యాంకు ఖాతాలకు ఆధార్ జత చేశారా?

Sunday, March 11th, 2018, 06:16:59 PM IST


బ్యాంక్‌ ఖాతాలు, మొబైల్‌ నెంబరు, ఆధార్‌ తో అనుసంధానం చేయడం వల్ల ఆర్థిక భద్రతకు అవకాశాలు మెరుగు పడతాయి అని ప్రభుత్వం చెపుతోంది. అయితే ఈ నెల 31 వ తేదీతో మొబైల్, బాంక్ ఖాతాలకు ఆధార్ జతచేయడం ముగుస్తోంది. అందులోను అందుతున్న సమాచారం ప్రకారం సుప్రీమ్ కోర్ట్ కూడా దీనిపై గడువును పెంచేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే రెండు అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి.

కనెక్షన్‌ యాక్టివేట్‌ అయినపుడు నెట్‌వర్క్‌ సంస్థ వద్ద ఎవరి వివరాలున్నాయో, వారి ఆధార్‌తో ఇప్పుడు జత చేస్తున్నారు. ఇందుకోసం మొబైల్‌ నుంచి 14546కు కాల్‌ చేసి, ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో లభించే సూచనలకు అనుగుణంగా, ఆధార్‌ నమోదు చేయాలి. అప్పుడు వచ్చే ఓటీపీని నమోదు చేస్తేనే, 48 గంటల వ్యవధిలో ఆధార్‌తో అనుసంధానం అయినట్లు సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్‌) ఇస్తామనే బదులు వస్తోంది. ఒకే నెట్‌వర్క్‌ పరిధిలో, వేర్వేరు నెట్‌వర్క్‌ల పరిధిలో ఉన్న కనెక్షన్లన్నింటికీ వేర్వేరుగా వేలిముద్ర వేయాలి. ప్రతి సిమ్‌కు ఓటీపీ వస్తుంది. అది నమోదు చేసి, వేలిముద్ర వేస్తేనే, ఆధార్‌తో అనుసంధానమై కనెక్షన్‌ సేవలు కొనసాగుతాయి.
ఇక కనెక్షన్ల సంఖ్యను కూడా ఒక వ్యక్తికి 9 కే పరిమితం చేయాలన్న లక్ష్యంతో ఉందని, ఒక ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్‌ సంస్థ అధికారి తెలిపారు. ఇంట్లో నలుగురున్నా, ఒక్కొక్కరు రెండు కనెక్షన్లు (డ్యూయల్‌సిమ్‌ ఫోన్లు) వాడుతున్నా, 8 కనెక్షన్లు సరిపోతాయనే భావనతో ఇలా చేస్తున్నారని సమాచారం. తమ చుట్టాలు, సన్నిహితులకు కూడా ఇలా సిమ్‌కార్డులు ఇచ్చిన వారెందరో. ఏ వ్యక్తి పేరిట సిమ్‌ కార్డు యాక్టివేట్‌ అయి ఉందో, ఆ వ్యక్తి వేలిముద్రలు, ఆధార్‌ను మొబైల్‌ కనెక్షన్‌కు అనుసంధానించాల్సి వస్తుంది. ఒక వ్యక్తి పేరిట కనెక్షన్‌ ఉండి, మరొకరు వినియోగిస్తుంటే, ఇప్పుడు ఆధార్‌ ధ్రువీకరణలు ఇస్తే, శాశ్వతంగా తమ పేరిట ఉంటుంది. లేదా సంబంధితుల ఆధార్‌ వివరాలు నమోదు చేయాలి.

గత అక్టోబరు ఆఖరుకు దేశంలో మొబైల్‌ కనెక్షన్లు 117.82 కోట్లు అయితే, యాక్టివ్‌గా ఉన్నవి 102.58 కోట్లు మాత్రమేనని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ గణాంకాలు చెపుతున్నాయి. అయితే ల్యాండ్‌లైన్‌, ఇంటర్నెట్‌, డీటీహెచ్‌ కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానించాల్సిన అవసరం లేదు. అలానే ఆధార్ ను బ్యాంకు ఖాతాకు గడువు తేదీలోగా అనుసంధానించకపోతే మన ఖాతా లావాదేవీలు చేయడం కుదరదు. అందుకోసం బ్యాంకు లు ఆన్లైన్, మరియు ఆఫ్ లైన్ పద్ధతుల్లో తమ ఆధార్ నెంబర్ ను అకౌంట్ కు జతచేసేలా ఇప్పటికే పలు మార్గాలు ప్రవేశ పెట్టాయి. బ్యాంకుల వెబ్‌సైట్‌/మొబైల్‌ ద్వారా లావాదేవీ జరపాలనుకున్నా, అక్కడ నమోదై ఉన్న మొబైల్‌ నెంబరుకు వచ్చే ఓటీపీ ఆధారంగానే పూర్తవుతోంది. మీరు కూడా మీ మొబైల్, బ్యాంకు ఖాతాలను ఆధార్ తో అనుసంధానించకపోతే ఇప్పుడే చేయండి మరి…

  •  
  •  
  •  
  •  

Comments