అమితాబ్ పాత్రలో నటించనున్న రెబల్ స్టార్…?

Monday, January 23rd, 2017, 09:20:45 AM IST

Krishna-Vamsi
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అసలు బాలకృష్ణ తన 100వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ అనే సినిమా చేద్దామనుకున్నారు. కానీ క్రిష్ చెప్పిన కథ తన 100వ సినిమాకు కరెక్టుగా సరిపోతుందని భావించిన బాలయ్య ‘రైతు’ సినిమా వాయిదా వేసి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేశారు. ‘రైతు’ సినిమా తన 101వ సినిమాగా ఉంటుందని కూడా అప్పట్లో బాలయ్య చెప్పారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటింపజేయాలని బాలయ్య మరియు దర్శకుడు కృష్ణవంశీ అనుకున్నారు. అమితాబ్ ను కూడా సంప్రదించి కథ చెప్పారు. అయితే అమితాబ్ ఇప్పటివరకూ ఏ విషయం చెప్పకపోవడంతో ఈ సినిమా యూనిట్ డైలమాలో పడింది.

ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ మాట్లాడుతూ… అమితాబ్ బచ్చన్ ఒప్పుకుంటేనే ‘రైతు’ సినిమా ఉంటుందని, లేదంటే ఆ సినిమా ఉండకపోవచ్చని చెప్పారు. దీంతో బాలయ్య అభిమానులు ఇక ఆ సినిమా సంగతి మర్చిపోయారు. అయితే ఇప్పుడు దర్శకుడు కృష్ణవంశీ అందుకు భిన్నంగా స్పందించాడు. అమితాబ్ కాదంటే మాత్రం అంత మంచి కథను ఎలా వదులుతానని, అమితాబ్ ఒప్పుకోకపోతే ఆ పాత్రను రెబల్ స్టార్ కృష్ణంరాజు తో చేయిస్తానని అంటున్నాడు. కృష్ణంరాజు ఆ పాత్రకు సరిగ్గా సరిపోతారని కృష్ణవంశీ స్పష్టం చేసాడు. ఒక నటుడి గురించి మొత్తం సినిమాను ఆపేయడం సబబు కాదని కృష్ణవంశీ అంటున్నట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితులలోనూ బాలకృష్ణను ఒప్పించి ఈ సినిమాను పూర్తి చేయాలనీ కృష్ణవంశీ పట్టుదలగా ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.