శంక‌ర్ పిల్లాడిలా ఏడ్చిన డేంజ‌ర్ ఇన్సిడెంట్

Wednesday, May 16th, 2018, 07:37:47 PM IST

ఒక్కోసారి ఆన్ లొకేష‌న్ ప్ర‌మాదాలు ఎంతో భ‌యాన‌క స‌న్నివేశాన్ని క్రియేట్ చేస్తాయి. క‌ళ్ల ముందే ర‌క్త‌సిక్త స‌న్నివేశాన్ని చూడాల్సొస్తుంది. సినిమాల‌కు సంబంధించి రిస్కీ ఫైట్స్ తెర‌కెక్కించేప్పుడు అలాంటి సంఘ‌ట‌న‌లు అరుదుగా జ‌రుగుతుంటాయి. అలాంటి ఓ ఘ‌ట‌న స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ను క‌ళ్ల‌నీళ్ల ప‌ర్య ంతం చేసింది. ‘అపరిచితుడు’ షూటింగ్‌ సమయంలో ఆన్ లొకేషన్ జ‌రిగిన ప్ర‌మాదం చూసి దర్శకుడు శంకర్‌ చిన్నపిల్లాడిలా ఏడ్చారని ప్రముఖ స్టంట్‌ డైరెక్టర్‌, నటుడు సిల్వ తెలిపారు. విక్రమ్‌, సదా జంటగా నటించిన ‘అపరిచితుడు’ చిత్రానికి అసిస్టెంట్‌గా సిల్వ పనిచేశారు. సిల్వ మాట్లాడుతూ -“ఈ సినిమాలో భారీ పోరాట ఘట్టాన్ని ఓ స్టేడియంలో తెరకెక్కిస్తున్నాం. మొత్తం 150 మంది స్టంట్‌మెన్‌లు ఫైట్ సీన్‌లో పాల్గొన్నారు. ఓ సన్నివేశంలో 70 నుంచి 75 మంది గాల్లోకి ఎగరాల్సి ఉంది. ఈ సీన్ లో అంద‌రికీ తాళ్లు క‌ట్టి ఒకేసారి లాగాలి. మేం షూట్‌ చేస్తున్న స్టేడియం బయట ఉన్న ఓ లారీకి ఆ తాళ్లను కట్టి.. అందర్నీ లాగాలని పీటర్‌ మాస్టర్‌ ప్లాన్‌ చేశారు. ఆ టైమ్‌లో లారీ డ్రైవ‌ర్ తొంద‌ర‌పాటు పెను ప్ర‌మాదానికి కార‌ణ‌మైంది. ద‌ర్శ‌కుడు యాక్షన్‌ అని చెప్పకుండానే డ్రైవ‌ర్ లారీ నడిపారు. అప్ప‌టికి స్టంట్‌మెన్‌లు ఎవ‌రూ సన్నివేశం కోసం సిద్ధం కాలేదు. అత‌డి పొరపాటు వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది. లారీ ముందుకు నడపడంతో అందరూ గాల్లోకి ఎగిరి, స్టేడియంలో కిందపడ్డారు. లొకేషన్‌ రక్తంతో నిండిపోయింది. స్టంట్‌మ‌న్‌ చేతులు, కళ్ల నుంచి రక్తస్రావం అయ్యింది. ఒకరికి ఫిట్స్‌ వస్తే.. మరొకరి కంటి నుంచి రక్తం కారింది. అంద‌రినీ ఆస్ప‌త్రికి చేర్చి చికిత్స అందించి రక్షించుకోగలిగాం. కానీ ఆ రోజు శంకర్‌ సర్ ఎంత‌గానో కుంగిపోయారు. ప్ర‌మాదం చూసి చిన్నపిల్లాడిలా ఏడ్చారు.. అని సెల్వ తెలిపారు.