సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న దిశ తల్లిదండ్రులు…

Saturday, December 14th, 2019, 02:47:03 AM IST

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలించిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈమేరకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా కొత్త చట్టాలని రూపొందించడానికి కృషి చేస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు భద్రతగా కొత్తగా దిశ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేశారు. కాగా మహిళలకు రక్షణగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినందుకు సీఎం జగన్ పై దిశ తల్లిదండ్రులు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.

కాగా ఎవరైతే మహిళలపై దారుణంగా లైంగిక దాడులకు పాల్పడుతారో, అలాంటి మృగాలకు ఈ తాజా దిశ చట్టం ద్వారా తక్షణమే శిక్షలు పడాలని దిశ తండ్రి కోరుకున్నారు. అంతేకాకుండా ఇలాంటి చట్టాలని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని, అందరు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకోవాలని దిశ తండ్రి కోరారు. ఇకపోతే గతంలో కళాశాలలో రాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థిని రిషికేశ్వరి తల్లిదండ్రులు కూడా ఈ చట్టం విషయంలో సీఎం జగన్ ని ప్రశంసించారు.