బడుంబా స్టెప్ వేయండి.. అమితాబ్ ని కలిసే చాన్సు కొట్టేయండి..

Monday, April 16th, 2018, 07:01:00 PM IST

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తరచూ ఓ పదం వాడుతుంటారు. ఆ పదం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఇంతకీ ఆ పదం ఏంటంటే..‘బడుంబా’. బిగ్‌బి ఏం ట్వీట్‌ చేసినా, ఏ పోస్ట్‌ పెట్టినా ఈ పదం వాడకుండా ఉండరు. అయితే ఈ పదానికి అర్థం ఏంటో బిగ్‌బి తాజాగా వెల్లడించారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘102 నాటౌట్‌’. ఈ సినిమాలో ‘జుంబా జుంబా బడుంబా..’ అనే పాటను బిగ్‌బి పాడారు. ఈ పాట వీడియోను ట్విటర్‌లో విడుదల చేశారు.

ఆదివారం సీఎస్‌కే, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా విరామ సమయంలో మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ కపిల్‌ దేవ్‌ ఈ పాటను విడుదల చేశారు. అనంతరం అమితాబ్‌ను సరదాగా ఇంటర్వ్యూ చేశారు. పాట మొదట్లో బడుంబా పదానికి అర్థం వివరిస్తూ..‘బడుంబా అంటే జోష్‌. ఆనందం కలిగిస్తుంది. ఈ పాట వింటే మీలో తెలీని ఉల్లాసం కలుగుతుంది’ అని అమితాబ్‌ పేర్కొన్నారు. ఈ పాటకు అభిమానులు పేరడీ వెర్షన్లు తనకు పంపాల్సిందిగా అమితాబ్‌ కోరారు. ఈ పాటను అమితాబ్‌ కంపోజ్‌ చేయగా..అమితాబ్‌ భట్టాచార్య లిరిక్స్‌ రాశారు.

‘102 నాటౌట్‌’ చిత్రంలో అమితాబ్‌ తండ్రి పాత్రలో రిషి కపూర్‌ కుమారుడి పాత్రలో నటిస్తున్నారు. ఉమేశ్‌ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్‌ 102 ఏళ్లు బతికి ప్రపంచంలోనే కురువృద్ధుడు కావాలని కలలు కంటుంటారు. కానీ 72 ఏళ్ల రిషి కపూర్‌కి మాత్రం తన తండ్రి చేసే పనులు నచ్చవు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే సినిమా కథ. మే4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.