ఖ‌ర‌గ్‌పూర్‌లో ‘క‌బాలి’ ని కొట్టే తెలుగు ‘డాన్ శీను’ !!

Thursday, January 26th, 2017, 01:00:19 AM IST

don-cnu
ఖ‌ర‌గ్‌పూర్‌లో గ్యాంగ్ వార్ పెట్రేగిపోతోందా? అక్క‌డ ఉన్న తెలుగువాళ్ల‌కు మునుముందు మ‌రింత మూడ‌నుందా? అంటే అవున‌నే తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి. అయితే ఖ‌ర‌గ్‌పూర్‌లో స్థిర‌ప‌డిన తెలుగు డాన్ శ్రీ‌ను నాయుడు హ‌త్య‌తో ఇప్పుడు అక్క‌డ తెలుగువారి ఉనికి ప్ర‌శ్నార్థ‌క‌మైంది.

శ్రీ‌నునాయుడు రాక‌తో ఖ‌ర‌గ్‌పూర్‌లో గ్యాంగ్ వార్స్‌లో తెలుగువాళ్ల హ‌వా మొద‌లైంది. తుపాకీ చ‌ప్పుళ్ల‌తో ఉలిక్కిపాటుకు గురైన సిటీ..క‌ల‌వ‌ర‌ప‌డే రేంజులో ర‌క్త చ‌రిత్ర‌కు కార‌ణ‌మ‌వ్వ‌డానికి తెలుగువాడైన గ్యాంగ్‌స్ట‌ర్ శ్రీ‌ను కార‌కుడ‌న్న ప్ర‌చారం ఎప్ప‌టినుంచో ఉంది. అక్క‌డ లోక‌ల్‌గా చెల‌రేగిపోతున్న మాఫియా లీడ‌ర్‌గా అత‌డు వెలిగిపోయాడు.

అస‌లు ఖ‌ర‌గ్‌పూర్ అన్న పేరే ఫేమ‌స్‌. దేశంలోనే ఈ సిటీ చాలా ఫేమ‌స్‌. ఐఐటీ, రైల్వే క‌ర్మాగారాలు ఉన్న ప్ర‌ధాన న‌గ‌రం ఇది. దేశంలోనే అతిపెద్ద‌ రైల్వే వ‌ర్క్‌షాప్ ఉంది. ప్ర‌పంచంలోనే రెండో రైల్వే ప్లాట్‌ఫాం ఖ‌ర‌గ్‌పూర్‌లో ఉంది. శ్రీ‌ను హ‌త్యోదంతంతో కొత్త సంవ‌త్స‌రం ఆరంభంలోనూ న్యూస్‌లోకొచ్చిన ఈ న‌గ‌రం.. ఇక్క‌డ గ్యాంగ్‌వార్‌ల‌తో పెట్రేగిపోవ‌డం సిటీకే బ్యాడ్‌నేమ్ తెచ్చింది. ఇక్డ‌డ నాలుగు ల‌క్ష‌ల జ‌న‌సాంద్ర‌త ఉంది. ఐఐటీ, రైల్వే వ‌ర్క్‌షాప్ ఏరియాలో డాన్ శ్రీ‌ను అంటే తెలియ‌నివారెవ‌రూ ఉండ‌రు.

రైల్వే వ‌ర్క్‌షాప్‌లో ప‌నిచేయ‌డానికి వెళ్లిన తెలుగువాళ్లు, ఉత్త‌రాంధ్రులు అనాదిగా సెటిలై ఉన్నారు. తెలుగువాళ్లు కొన్ని త‌రాలుగా ఉన్నారు. ప‌ట్ట‌ణంలో మెజారిటీ ప్ర‌జ‌లు తెలుగువారే. ఇలాంటి టైమ్‌లోనే రాజ‌కీయం, క్రైమ్ వైపు మ‌న తెలుగువాళ్లు వెళ్లారు. అక్క‌డ రాజ‌కీయాల్ని, క్రైమ్‌ని ఏక‌కాలంలో న‌డిపించిన అల్లం శ్రీ‌ను నాయుడు నూనూగు మీసాల వ‌య‌సులోనే గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారాడు. స్క్రాప్ వ్యాపారం గ్యాంగ్ వార్ న‌డిపిస్తూ కోటీశ్వ‌రుడిగా ఎదిగాడు శ్రీ‌ను నాయుడు.

అయితే ఇత‌డు 26 ఏళ్ల‌కే గ్యాంగ్ వార్‌లో హ‌త‌మ‌య్యాడు. శ్రీ‌ను నాయుడు బ్యాక్‌డ్రాప్‌లోకి వెళితే.. క‌డ‌ప నుంచి వెళ్లి అక్క‌డ మాఫియాని ఏర్పాటు చేసిన తెలుగువాడు. నేరాలు- ఘోరాలు చేస్తూ మాఫియా డాన్‌గా మారాడు. రైల్వే ఏరియాలో సెటిల్‌మెంట్లు చేసేవాడు. కాల‌క్ర‌మంలో బీజేపీలో చేరాడు. త‌న భార్య పూజానాయుడు ప‌ట్ట‌ణంలోని 18వ వార్డులో గెలిపించుకున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భార్య‌ను ఎమ్మెల్యేగా నిల‌బెట్టాల‌నుకున్నాడు. ఇంత‌లోనే అత‌డు గ్యాంగ్‌వార్‌లో హ‌త‌మ‌య్యాడు. నేర సామ్రాజ్యంలో `క‌బాలి`ని కొట్టే డాన్ శీనుగా ఎదిగిన శ్రీ‌ను నాయుడు పిన్న వ‌య‌సులోనే అంత‌మ‌య్యాడు. ఈ గ్యాంగ్‌స్ట‌ర్ యుద్ధంలో చాలామంది తెలుగువాళ్లు హ‌త‌మ‌య్యారు. ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న తెలుగువాళ్లు ఆధిప‌త్య‌పోరులో ఓట‌మి పాల‌వుతామ‌న్న భ‌యంలోనూ ఉన్నారిప్పుడు.