పవన్ ప్రశ్నించడేం?

Wednesday, September 24th, 2014, 06:37:16 PM IST


వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ బుధవారం కాకినాడలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ నటుడు, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలు అన్యాయానికి గురైతే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు కనిపించలేదేమని నిలదీశారు. కనీసం ప్రశ్నించడానికి కూడా పవన్ జాడ కానరావడంలేదని చంద్రశేఖర్ మండిపడ్డారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీల వలనే ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని, ప్రజల పక్షంగా పోరాడడానికి తాము ఎప్పుడు ముందుంటామని ద్వారంపూడి చంద్రశేఖర్ తెలిపారు.

ఇక ఎన్నికల సమయంలో తన వాక్చాతుర్యంతో, ఫేంతో ప్రజలను ముగ్ధుల్ని చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత పెద్దగా రాజకీయ వ్యవహారాలపై దృష్టి సారించకపోవడాన్ని కొన్ని పార్టీలు తప్పు పడుతున్నాయి. పవన్ ప్రశ్నించడానికి రావట్లేదని వైకాపా నేత అడిగినట్లే తాజాగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా పవన్ కనిపించడంలేదని, ఎన్నికల ముందు మేకప్ వేసుకుని కాసేపు నటించి మరలా కనుమరుగయ్యారని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక అన్ని చూస్తూ, వింటూ పవన్ ఎందుకు మిన్నకుండిపోతున్నారో ఎవరికీ అంతుపట్టని విషయమే మరి.