ప్రశాంతంగా ముగిసిన ఉపఎన్నిక పోలింగ్

Saturday, September 13th, 2014, 06:54:06 PM IST


ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నందిగామ శాసన సభ, తెలంగాణ మెదక్ లోక్ సభ స్థానాలకుశనివారం జరిగిన ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా సాయంత్రం 6గంటలకు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఇక మెదక్ లోక్ సభ స్థానం పరిధిలో సాయంత్రం 5గంటల సమయానికి 63.14% పోలింగ్ నమోదు కాగా, నందిగామ పరిధిలో 63% నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా మెదక్ లోక్ సభ పరిధిలోని సిద్ధిపేటలో 64.5%, మెదక్ లో 63%, నర్సాపూర్ లో 76% , సంగారెడ్డిలో 60%, పటాన్ చెరులో 49%, దుబ్బాకలో 64.5%, గజ్వేల్ లో 65% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

ఇక మెదక్ ఎంపీ స్థానం కోసం ఎన్నికల పోటీలో తెరాస నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుండి సునీతా లక్ష్మారెడ్డి మరియు టిడిపి-బీజేపి పొత్తు అభ్యర్ధి తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) ఉండగా, నందిగామ శాసన సభ స్థానానికి టిడిపి అభ్యర్ధిగా తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ తరపున బోడపాటి బాబురావు, మరో ఇద్దరు స్వాతంత్ర్య అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వీరంతా కూడా ఈరోజు ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.