ఎమీజాక్స‌న్ హాలీవుడ్ సూప‌ర్ గాళ్‌!?

Thursday, January 11th, 2018, 07:29:43 PM IST

క్వాంటికో సిరీస్‌తో ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ని ఆటాడుకున్న సంగ‌తి తెలిసిందే. పీసీ లేనిదే క్వాంటికో షో లేనేలేదు అన్నంత‌గా పాపుల‌రైపోయింది. ఒకే ఒక్క టీవీ సిరీస్‌తో ప్రియాంక చోప్రాకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులేర్ప‌డ్డారు. ఆ క్ర‌మంలోనే పీసీకి వ‌రుస‌గా క్రేజీ సినిమాల్లో అవ‌కాశాలొస్తున్నాయి. డాల‌ర్ల‌లో కాంట్రాక్టులు కుదుర్చుకుంటూ బాగానే ఆర్జిస్తోంది. పీసీ బాట‌లోనే దీపిక ప‌దుకొన్ ప‌లు క్రేజీ అవ‌కాశాలు అందుకుంటోంది.

ఇప్పుడు ఆ ఇద్ద‌రి బాట‌లో మ‌రో అందాల భామ హాలీవుడ్‌లో కెరీర్‌ని ప‌రుగులు పెట్టించే ప్లాన్ లో ఉంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ రోబో 2 లో లేడీ రోబోగా న‌టించిన ఎమీజాక్స‌న్ .. హాలీవుడ్‌లో ఓ సూప‌ర్ గాళ్‌గా న‌టించింది. అక్క‌డ ప్ర‌ఖ్యాత మెలిస్సా బేనోయిస్ట్ సూప‌ర్‌హీరోస్ షోలో న‌టించింది ఎమీ. ఎమీజాక్స‌న్ సూప‌ర్‌గాళ్ పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే 20 న‌వంబ‌ర్ 2017న ఎమీజాక్స‌న్ ఎపిసోడ్ లైవ్ అయ్యింది. అప్పుడు ఎగ్జిట్ అయిన ఎమీ మ‌ళ్లీ.. జ‌న‌వ‌రి 15 షోతో లైవ్‌లోకి వ‌స్తోంది. ఇందులో భూమిని కాపాడే సూప‌ర్‌గాళ్ పాత్ర‌లో ఎమీజాక్స‌న్ క‌న్నుల‌పండువ చేయ‌బోతోంది. కామిక్ బుక్ స్టోరీల ఆధారంగా రూపొందిన ఈ సూప‌ర్‌హీరో సిరీస్‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ఆ కోవ‌లో ఎమీకి భారీగా అభిమానులు పెరుగుతున్నారు. ఈ సిరీస్‌తో వ‌చ్చిన పాపులారిటీతో ఎమీ కూడా హాలీవుడ్ నాయిక‌గా బిజీ అయిపోవ‌డం గ్యారెంటీ అని చెబుతున్నారు. ఇక రోబో 2 చిత్రంతో ఎమీజాక్స‌న్ స్థాయి ఇండియాలోనూ మ‌రింత రెట్టింపు కావ‌డం షురూ అయిన‌ట్టే.