క్రికెట్ పరువు తీసిన ఇంగ్లాండ్ ఆటగాళ్ళు

Tuesday, August 27th, 2013, 01:43:56 PM IST

cricket
ఇంగ్లాండు క్రికెటర్లు అత్యంత సిగ్గుమాలిన పనికి ఒడిగట్టారు. ఆస్ట్రేలియాపై ఆదివారంనాడు 3-0 స్కోరుతో యాషెస్ సిరీస్‌ను గెలిచిన తర్వాత ఇంగ్లాండు ఆటగాళ్లు ఓవల్ పిచ్‌పై మూత్రం పోశారు. ఐదోది, చివరిది అయిన టెస్టు మ్యాచ్ ఆదివారం నాడు డ్రాగా ముగిసింది. సిరీస్ విజయాన్ని అందుకున్న ఇంగ్లాండు క్రికెట్ క్రీడాకారులు మధ్య రాత్రి వరకు వేడుకలు జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా ఇంగ్లాండు క్రికెటర్లు అనుచితమైన చర్యకు పాల్పడ్డారు. మైదానంపై మూత్రం పోశారు. నైట్ క్లబ్ బౌన్సర్స్‌పై మూత్రం పోసినందుకు ఇంగ్లాండు క్రికెటర్ మోంటీ పనేసర్‌కు పోలీసులు జరిమానా విధించారు.

అతనే మిగతా క్రీడాకారులకు దారి చూపినట్లు కనిపిస్తున్నాడు. అర్థరాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో స్టార్ట్ బ్రాడ్, కెవిన్ పీటర్సన్ తాము కూర్చున్న చోటు నుంచి లేచి మైదానంలో మూత్రం పోయడం ప్రారంభించారు. ఇది ఆస్ట్రేలియాకు చెందిన ఒక జర్నలిస్టు గుర్తించాడు. ఈ విషయాన్ని తమ మీడియాకు వివరించడంతో ‘మూత్రం’ ఘటన ఒక్కసారిగా తీవ్ర దుమారం రేపింది. ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రవర్తన పట్ల ఆసీస్ మీడియా దుమ్మెత్తిపోసింది. ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు ఇంగ్లండ్ కోచ్ ఆండీ ఫ్లవర్ నిరాకరించినా.. అక్కడి క్రీడల మంత్రి హ్యూస్ రాబర్ట్‌సన్ మాత్రం విచారణ జరపాల్సివుంటుందని ప్రకటించాడు.