అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ది చెబుతాం – ఈటెల రాజేందర్

Tuesday, June 8th, 2021, 03:11:47 PM IST

తెలంగాణ రాష్ట్రం లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటి వరకూ అధికార పార్టీ లో ఉన్న ఈటెల రాజేందర్, రాజీనామా ప్రకటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. అయితే తెరాస కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఈటెల రాజేందర్ ఆయన నియోజక వర్గం లో పర్యటించారు. కమలపూర్ మండలం లో అభిమానులు మరియు కార్యకర్తల తో కలిసి ఈటెల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. అయితే ఈ నేపథ్యం లో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కరీం నగర్ కేంద్ర బిందువు అని, ఎత్తిన జెండా, బిగించిన పిడికిలి తో ముందుకు సాగుతామని ఈటెల రాజేందర్ అన్నారు. అయితే ఆనాడు సింహ గర్జన కి కరీం నగర్ ఎలా తొలి పలుకు పలికిందో, నేడు హుజూరాబాద్ కూడా ఆత్మ గౌరవ పోరాటానికి, అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమ క్షేత్రంగా మారనుంది అని వ్యాఖ్యానించారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ధర్మానికి, అధర్మానికి మధ్య సంగ్రామం జరగనుంది అని అన్నారు. అయితే కొందరు తొత్తులుగా మారి విమర్శలు చేస్తున్నారు అని, అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ది చెబుతాం అని హెచ్చరించారు. అయితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కి బుద్ది చెబుతామని హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలు చెప్పారు అని, ఎన్నికలో తన విజయానికి భరోసా ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు.