రాజకీయాలు, వెకిలిచేష్టలు ఇప్పుడు కాదు – ఈటెల రాజేందర్

Sunday, May 16th, 2021, 10:08:22 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల మాజి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం లో గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది చనిపోతున్నారు అని, సీఎం స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహించి ఏ జిల్లాలో మంత్రులు, ఆ జిల్లాలో కరోనా రోగులకు అందే సేవలను పర్యవేక్షించాలి అని వ్యాఖ్యానించారు. అయితే కరీం నగర్ లో అందుకు భిన్నంగా ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి గొర్రెల మంద మీద తోడేళ్ళ లా హుజూరబాద్ ప్రజా ప్రతినిధుల పై దాడి చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ ఉద్యమాన్ని కాపాడి ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిన నియోజక వర్గం లోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను ఉద్యమం తో ఏ మాత్రం సంబంధం లేని మంత్రి, సీఎం నియమించిన కొందరు ఇన్ ఛార్జ్ లు ఫోన్ చేసి డబ్బులు ఆశ చూపుతూ, అభివృద్ది పనుల బిల్లులు రావంటూ బెదిరిస్తున్నారు అని ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే తెలంగాణ రాష్ట్రం లో చైతన్యం నింపిన గడ్డ మీద కుట్ర చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన సమయం ఇది అని,రాజకీయాలు, వేకిలిచేష్టలు ఇప్పుడు కాదు అంటూ విమర్శించారు. ఇకనైనా ఆపండి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. సమైక్య రాష్ట్రం లో సైతం ఇలాంటి ప్రయత్నం చేసి భంగ పడ్డారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని, సరైన సమయంలో గుణపాఠం చెబుతారు అంటూ చెప్పుకొచ్చారు.