ఈ సారైనా వారిద్దరికి హిట్ దక్కేనా??

Tuesday, March 27th, 2018, 09:48:40 AM IST

మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఒక రకంగా సక్సెస్ ల పరంగా కొంచెం వెనుకపడ్డారు. దీనికి ప్రధాన కారణం ఆయన చేస్తున్న సినిమాల తాలూకు కథల సెలెక్షన్ అని ఫిలిం నగర్ టాక్. విన్నర్, జవాన్, ఇంటెలిజెంట్ వంటి సినిమాల్లో తేజు పక్కా కమర్షియల్ ఫార్ములా వైపు అడుగులు వేసాడని అందుకే అవి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదని అంటున్నారు. అలానే ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ అయిన కరుణాకరన్ కూడా డార్లింగ్ తరువాత చేసిన ఎందుకంటె ప్రేమంట, చిన్నదానా నీకోసం చిత్రాలతో ప్లాప్ లు చవిచూశారు. ప్రస్తుతం ఈ ఇద్దరూకలిసి క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఒక సినిమా చేస్తున్నారు.

అయితే ఈ సినిమాని కరుణాకరన్ ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సహజంగానే కరుణాకరన్ మూవీస్ చాలా క్లీన్ గా ఉంటాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెప్పించేలా సున్నితమైన కామెడీతో నిండిన సినిమాలు తీయడం కరుణాకరన్ ప్రత్యేకత. తేజుతో చేయనున్న మూవీలో కూడా ఇవన్నీ నిండి ఉంటాయని తెలుస్తోంది. అసలు ఈ సినిమాలో చిన్నపాటి సన్నివేశాలు మినహా, మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉండబోవట. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ, సాన్నిహిత్యం ఈ రెండే మెయిన్ థీమ్ గా సినిమా సాగనుందని తెలుస్తోంది. ఈ మూవీలో సాయిధరం తేజ్ పేరు తేజు కాగా, అనుపమ పాత్ర పేరు నందిని.

డిగ్రీ పూర్తయిన తర్వాత ప్రేమలో పడ్డ జంటగా కనిపించనున్నారు. అటు అర్బన్ ఎపిసోడ్స్, ఇటు రూరల్ బ్యాక్ గ్రౌండ్ ను సమపాళ్లలో మిక్స్ చేసిన ఈ చిత్రంలో, హీరో హీరోయిన్లకు సమానమైన ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఏప్రిల్ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసి జూన్ మొదటివారంలోగా సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారట….