చంద్రబాబుతో ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు..అందుకే వెళ్లిపోతున్నా

Tuesday, September 10th, 2019, 05:15:07 PM IST

2014 వైసీపీ తరుపున గెలిచి, టీడీపీలోకి జంప్ అయ్యి మంత్రి పదవి చేపట్టిన ఆదినారాయణ రెడ్డి, ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసి ఈ నెల 11న బీజేపీ పార్టీలోకి చేరబోతున్నాడు. దీనిపై ఇప్పటికే క్లారిటీ వచ్చిన కానీ, తాజాగా ఆదినారాయణ రెడ్డి ఏకంగా చంద్రబాబు నాయుడుని కలిసి తాను ఎందుకు పార్టీ మారాలని అనుకున్నాడో వివరంగా చెప్పాడు .

దాదాపు గంటకి పైగా జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో వైసీపీ పార్టీ నుండి తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి, క్యాడర్ ఎదుర్కుంటున్న ఆటుపోట్లు గురించి బాబుకి చెప్పాడు. కేవలం మూడు నెలల కాలంలోనే జగన్ పాలన కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చిందని, దానిని క్యాష్ చేసుకుంటూ టీడీపీ పోరాటాలు చేయవల్సిన సమయం వచ్చిన కానీ, టీడీపీ ఆ దిశగా ముందుకి సాగటం లేదని కుండబద్దలు కొట్టాడు.

అంతే కాకుండా తనకి గత ఎంపీ ఎన్నికల్లో ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి, పార్టీ తరుపున మాట ఇచ్చి చివరి నిమిషంలో ఇవ్వలేనిదని దాని వలన చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పుకొచ్చాడు. జిల్లా రాజకీయాల్లో తన క్యాడర్ నిలబడాలంటే, తన మనుగడ ఉండాలంటే తప్పనిసరిగా పార్టీ మారాల్సి ఉందని అందుకే బీజేపీలోకి వెళ్తున్నట్లు చెప్పి మరి ఆదినారాయణ రెడ్డి వెళ్ళటం విశేషం.