తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలోకి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్..!

Saturday, June 12th, 2021, 12:00:23 AM IST

తెలంగాణలో బలపడాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అందుకోసం కావాల్సిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ముఖ్యంగా ఇతర పార్టీల్లో అసంతృప్తి నేతలకు గాలం వేసి పార్టీలోకి చేర్చుకుంటూ పుల్ జోష్ మీద కనిపిస్తుంది. తాజాగా టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలోకి చేరుతుండడం ఆ పార్టీకి మరింత కలిసొచ్చే అంశం కాగా ఈటలతో పాటు మరికొందరు ముఖ్య నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది.

నేడు ఈటల రాజేందర్‌తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ భేటీ అయ్యారు. ఇదే స‌మ‌యంలో మాజీ ఎంపీ ర‌మేష్ రాథోడ్ కూడా ఈట‌ల నివాసానికి వచ్చి తరుణ్ చుగ్‌తో మంతనాలు జరిపారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న రమేష్ రాథోడ్ బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తుంది. తొలుత తెలుగుదేశంలో ఉన్న రమేశ్ రాథోడ్ 1999లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా, 2009లో అదిలాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఆయన అక్కడ సరైన ప్రాధాన్యం దక్కడంలేదని 2018లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్‌లో కూడా ఆయనకు సరైన గుర్తింపు దక్కకపోగా, ఇటీవల అధిష్ఠానం ఆయనను సస్పెండ్ చేసింది.

దీంతో తన అనుచరులతో చర్చించిన అనంతరం వారి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ మారాలనే యోచనకు వచ్చిన రమేష్ రాథోడ్ బీజేపీ గూటికి చేరేందుకు సిద్దమైనట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో షాక్ తప్పదనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ నెల 14న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, రమేష్ రాథోడ్‌తో పాటు ఆర్టీసీ టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డి , కంటోన్మెంట్‌కు చెందిన టీఆర్ఎస్ నేత కేశవరెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.