బ్రేకింగ్: జగన్ పాలనపై ప్రముఖ పారిశ్రామికవేత్త సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, August 20th, 2019, 03:45:32 PM IST

ఏపీలో ఈ ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

అయితే జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు కురిపించుకుంటున్నాడు. అయితే జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు బాగానే ఉన్నా కొన్ని నిర్ణయాలు మాత్రం బాగోలేవని కర్నాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త టీవీ మోహన్‌దాస్‌ పాయి ఆరోపించారు. అయితే ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో కొత్తగా ఏవైనా పెట్టుబడులు వస్తేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. అయితే జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వలన ఇన్వెస్టర్లకు ఏపీపై పూర్తిగా నమ్మకం పోయిందని రివర్స్ టెండరింగ్, కాంట్రాక్టుల రద్దు, పీపీఏల సమీక్షలాంటివి చేయడం వలన ఇప్పటికే వందల వేల కోట్లు పెట్టుబడిగా పెట్టిన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లలో కూడా భయం మొదలైందని అన్నారు. అంతేకాదు వరల్డ్ బ్యాంకు, ఆసియా బ్యాంకు వంటి దిగ్గజాలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయంటే అది ముమ్మాటికి జగన్ తీసుకున్న నిర్ణయాల వలనే అని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం అక్షయపాత్ర బోర్డులో సభ్యుడిగా ఉన్న మోహన్‌దాస్‌ పాయి ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తుందని టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లకు ఆహారాన్ని సరఫరా చేసిన అక్షయపాత్ర సంస్థకు దాదాపు 45కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని, అది అడిగితే అన్నా క్యాంటీన్లలో అవినీతి జరిగిందని అది తేలే వరకు డబ్బు చెల్లించేది లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. చేసిన పనికి బిల్లులు చెల్లించమని ప్రభుత్వం చెప్పడం ఉగ్రవాదాన్నే తలపిస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వైఖరి మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మరి మోహన్‌దాస్‌ పాయి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.