మితిమీరిన అభిమానం… సినిమాల మీద విష ప్రచారం! జై లవకుశ.. స్పైడర్!

Friday, September 29th, 2017, 01:05:24 PM IST


ఒకప్పుడు స్టార్ హీరోల మీద ఉండే పిచ్చి అభిమానం సినిమా రిలీజ్ అయ్యే టైం లో థియేటర్స్ దగ్గర ఫ్లెక్సీ విషయంలో గొడవలు జరుగుతూ ఉండేవి, ఒక వేళ ఒక హీరో మీద యాంటీ ఫ్యాన్స్ దుష్ప్రచారం చేసిన కొన్ని పరిధులు దాటి వెళ్ళేది కాదు. కారణం సోషల్ మీడియా లేకపోవడమే. దాంతో ఫ్యాన్స్ మధ్య విభేదాలు ఉన్న, అవి సినిమాల మీద అంతగా ప్రభావాన్ని చూపించేవి కాదు. దాంతో పాటు అభిమాన సంఘాల మధ్య ఎన్ని గొడవలు ఉన్న, దానిని సినిమాలకు అంటించే వారు కాదు. కాని కాలంతో పాటు మనుషుల్లో పశు ప్రవృత్తి, ఎదుటి వాడు బాధపడితే చూసి సంతోషించే మనస్తత్వం భాగా పెరిగిపోయింది. అలాగే అభిమానం కాస్తా దురభిమానం అయ్యింది. దాంతో పాటు హీరోల మీద ఇష్టం వచ్చినట్లు ట్రోల్స్ చేసుకోవడానికి, తమకు ఇష్టం లేని హీరో సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేయడానికి కావాల్సినంత స్కోప్ దొరికింది. దాంతో ఇప్పుడు ఈ అభిమానం మాటున ఫ్యాన్స్ కోట్ల పెట్టుబడి పెట్టె సినిమా ఇమేజ్ ని దారుణంగా దెబ్బ తీస్తూ వాళ్ళల్లో మూర్ఖత్వం ఎ స్థాయిలోకి చేరిపోయిందో చూపిస్తున్నారు.

తాజాగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. జై లవకుశ, స్పైడర్ రెండు సినిమాలు బాగున్నాయి. ఈ రెండింటిలో దేనికి అదే ప్రత్యేకం. జై లవకుశ మాస్ ఇమేజ్ తో అన్నదమ్ముల అనుబంధం మీద వెళ్తే, స్పైడర్ సినిమా సైకో థ్రిల్లర్ లో నడిచే కథలు. నిజానికి రెండు సినిమాలు సామాన్య ప్రేక్షకుడుకి భాగానే చేరువ అయ్యాయి. ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఫ్యాన్స్ ముసుగులో ఉన్న మూర్ఖులు, తమ యాంటీ హీరో సినిమా మీద ఇష్టం వచ్చినట్లు బూతు పోస్ట్ లతో ట్రోల్స్ చేయడం, అదే పనిగా నెగిటివ్ పబ్లిసిటీ చేయడం. సినిమా భాగోలేదని విమర్శిస్తూ పోస్ట్ లు పెట్టడం, దానికి తోడు కొత్తగా హీరోల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ వార్ హీరోలని బూతులు తిట్టెంత వరకు వెళ్ళిపోయింది, అలాగే వారిలో వారే అసభ్యకరమైన పదజాలంతో విమర్శలు చేసుకునేంత వరకు వెళ్లిపోయింది.

జై లవకుశ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ ఇష్టానుసారంగా నెగిటివ్ పబ్లిసిటీ చేయడం మొదలు పెట్టారు. ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ మీద పడింది. జై లవకుశ సినిమా మీద సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం ఎ స్థాయిలో ఉందో ఫ్యాన్స్ గ్రూప్స్ ఫాలో అయ్యే వారికి కచ్చితంగా క్లేరిటి వస్తుంది. ఆ వెంటనే స్పైడర్ సినిమా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా మీద కూడా అదే స్థాయిలో నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నారు. సినిమా మీద ఎవరికీ వారే ఇష్టం వచ్చినట్లు యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూలు రాసేస్తూ ఆ ప్రభావం సినిమా మీద పడేలా చేస్తున్నారు.

ఇలా సోషల్ మీడియాలో స్టార్ హీరోలు, ఫ్యాన్స్ – యాంటీ ఫ్యాన్స్ దురాభిమానం సైకో తరహాలో ఉన్న ప్రవర్తనలు కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాల మీద దారుణం ప్రభావం చూపిస్తున్నాయి. ఇక ఇప్పుడు యు ట్యూబ్ చానల్స్ మాటున యాంటీ ఫ్యాన్స్ ఇచ్చే నెగిటివ్ పబ్లిసిటీ వలన సినిమాని కోట్లు పెట్టిన కొనుక్కున డిస్టిబ్యూటర్స్ కూడా దారుణ నష్టాలని చవిచూడాల్సి వస్తుంది. అసలు రివ్యూల వలన సినిమాకి జరిగే నష్టం కంటే, ఇలా యాంటీ ఫ్యాన్స్ వలన సినిమాపై సోషల్ మీడియాలో జరిగే నెగిటివ్ పబ్లిసిటీ వలన ఎక్కువ నష్టం కలుగుతుంది. ఇకపై కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో భారీ పెట్టుబడులు పెట్టి సినిమాలు తీయాలంటే నిర్మాతలు భయపడే పరిస్థితి వస్తుంది. ఒక హీరో మీద అభిమానం ఉండటంలో తప్పు లేదు కాని అది దురాభిమానం క్రింద మారి, ఇంకో హీరో సినిమా ఆడకూడదు, మన హీరో సినిమా మాత్రమె ఆడాలి అనే ఆలోచనలతో ఫ్యాన్స్ ఉంటే మీ వలన తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందనేది వాస్తవం.

  •  
  •  
  •  
  •  

Comments